Greenland: గ్రీన్ లాండర్లుగానే ఉంటాం.. అమెరికన్లుగా కాదు..!
వెనెజువెలాను వశపర్చుకున్న అమెరికా.. ఇప్పుడు గ్రీన్ ల్యాండ్ పై కన్నేసింది. ఆదేశానికి అవసరమైతే భారీగా నిధులను పంపించి మరీ.. దారికి తెచ్చుకోవాలని భావిస్తోంది. అవసరమైతే నయానో..భయానో తన అదుపులోకి తెచ్చుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అయితే ట్రంప్ , అమెరికా తీరుపై గ్రీన్ లాండ్ వాసులు అసంతృప్తిగా ఉన్నారు. తమకు ఇప్పుడు బాగానే ఉందని.. తాము అమెరికన్లుగా ఉండాలని భావించడం లేదని స్పష్టం చేస్తున్నారు.
గ్రీన్లాండ్ను అమెరికా వశపరచుకోవాలంటూ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలపై స్థానిక రాజకీయ పార్టీల నాయకులు మండిపడుతున్నారు. గ్రీన్లాండ్ భవితవ్యాన్ని దాని ప్రజలే నిర్ణయించాలని వారు స్పష్టంచేస్తున్నారు. ‘‘మేం అమెరికన్లుగా ఉండాలనుకోవడం లేదు. డెన్మార్క్ పౌరులుగా, గ్రీన్లాండర్లుగా ఉండాలని కోరుకుంటున్నాం’’ అని గ్రీన్లాండ్ ప్రధాని జెన్స్ ఫ్రెడరిక్ నియెల్సన్తో పాటు నాలుగు స్థానిక పార్టీల నాయకులు ఒక సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
నాటో సభ్యదేశమైన డెన్మార్క్ నుంచి పాక్షిక స్వయంప్రతిపత్తి ఉన్న గ్రీన్లాండ్ను తేలికైన మార్గంలో సాధించాలని అనుకుంటున్నట్లు ట్రంప్ శుక్రవారం ప్రకటించారు. అమెరికా దాన్ని వశపరచుకోకపోతే రష్యా లేదా చైనా దాన్ని కబళిస్తాయని, ఆ దేశాలు తమకు పొరుగున ఉండాలని అమెరికా కోరుకోవడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. తేలికైన మార్గంలో ఇది జరగకుంటే ‘కష్టమైన మార్గంలోనైనా’ సాధిస్తామని హెచ్చరించారు. తమ దేశం పట్ల అమెరికాకున్న చులకన భావం నశించాలని కోరుకుంటున్నట్లు గ్రీన్లాండ్ పార్టీల నాయకులు అంటున్నారు. డెన్మార్క్, గ్రీన్లాండ్లకు చెందిన నాయకులు అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో వచ్చేవారం మళ్లీ సమావేశం కానున్నారు.






