Pawan Kalyan: ప్రజల మధ్యకు పవన్, భారీ ప్రాజెక్టులతో పిఠాపురంకి కొత్త దశ..
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం (Pithapuram Constituency) అభివృద్ధి దిశగా ఇప్పుడు కొత్త మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు ఒకలా ఉన్న ఈ నియోజకవర్గం, ఇకపై మరో స్థాయికి చేరనుందన్న భావన ప్రజల్లో బలంగా వ్యక్తమవుతోంది. కాపుల కంచుకోటగా గుర్తింపు ఉన్న పిఠాపురం నుంచి గతంలో పలువురు నేతలు ఎన్నికైనప్పటికీ, ప్రాంతీయ సమస్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదన్న అభిప్రాయం ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేగా మాత్రమే కాకుండా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్, నియోజకవర్గ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఇటీవల ఆయన దాదాపు 211 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పరిశ్రమలకు ఊతమిచ్చేలా 10 కోట్ల రూపాయలతో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ఏర్పాటు చేయనున్నారు. అలాగే కోనపాపపేట (Konapapapeta) ప్రాంతంలో మల్టీపర్పస్ ఫిషరీస్ సెంటర్ నిర్మాణానికి చర్యలు ప్రారంభమయ్యాయి. ఉపాధి హామీ పథకం ,ఆర్ అండ్ బి నిధుల సహాయంతో అద్దంలా మెరిసే రహదారులు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేలా గోకులాలకు సంబంధించిన పశువుల యూనిట్ల ఏర్పాటు కూడా ఈ అభివృద్ధి ప్యాకేజీలో భాగంగా ఉంది.
ప్రజలకు మరింత దగ్గర కావాలన్న ఉద్దేశంతో ‘పిఠాపురం సంక్రాంతి’ పేరుతో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ప్రజలతో కలసి, ఒక కళాశాల మైదానం నుంచి కుక్కుటేశ్వరస్వామి ఆలయం (Kukkuteswara Swamy Temple) వరకు కాలినడకన పర్యటించారు. వీధి వీధిగా తిరుగుతూ ప్రతి ఒక్కరినీ పలుకరిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా మహిళలు తమ ఇంటి స్థలాలకు సంబంధించిన సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. మరికొందరు ప్రమాదకరంగా వేలాడుతున్న విద్యుత్ తీగల గురించి ఫిర్యాదు చేశారు. పవన్ వెంటనే అధికారులను అప్రమత్తం చేసి, అక్కడికక్కడే పరిష్కార చర్యలు చేపట్టాలని సూచించారు.
పిఠాపురం పర్యటనలో భాగంగా ఆయన స్థానిక పోలీస్ స్టేషన్ను కూడా సందర్శించారు. స్టేషన్లోని గదులన్నింటినీ పరిశీలిస్తూ, రోజుకు ఎన్ని కేసులు నమోదు అవుతున్నాయి, ఎన్ని ఫిర్యాదులు పరిష్కారమవుతున్నాయన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా రాత్రి వేళ గస్తీలను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. మొత్తంగా చూస్తే, పిఠాపురం అభివృద్ధి విషయంలో పవన్ కళ్యాణ్ చూపుతున్న చొరవ ప్రజల్లో కొత్త ఆశలు రేపుతోంది. అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించే విధానం, ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో ఆదర్శంగా నిలబెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.






