MP Kalisetti : అక్కడ ఏం జరుగుతుందో సీబీఐతో దర్యాప్తు : ఎంపీ కలిశెట్టి
వైఎస్ జగన్ తాడేపల్లి ప్యాలెస్ (Tadepalli Palace) కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలోనే ఉంది. ఎప్పుడైనా అది మునిగిందా? అని తెలుగుదేశం పార్టీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు (Kalisetti Appalanaidu) ప్రశ్నించారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు (CM Chandrababu) నివాసం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అమలుచేస్తున్న కుట్రలకు బెంగళూరు (Bengaluru) లోని యలహంక ప్యాలెస్‌లో జగన్ పథక రచన చేస్తున్నారని విమర్శించారు. అక్కడ ఏం జరుగుతోందో సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని వివరించారు. వైసీపీ ఎంపీలు అవినాష్‌రెడ్డి, మిథున్ రెడ్డిల ఆస్తులు కొంతకాలంగా విపరీతంగా పెరిగాయి. వారి ఆస్తుల వివరాలు చూసి దేశంలోని ఎంపీలంతా ఆశ్చర్య పోతున్నారు. దోపిడీలు, భూకబ్జాలు, అక్రమాలు, బెదిరింపులతోనే వాళ్లు ఇన్ని ఆస్తులు సంపాదించారు. మరోపక్క రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా దొంగ సంతకాలతో జీతభత్యాలు తీసుకుంటున్నారు. కనీసం అసెంబ్లీకొచ్చి జగన్ తనను గెలిపించిన పులివెందుల ప్రజల సమస్యలపైనా ప్రస్తావించాలి అని అన్నారు.






