Adibatla: శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 81వ వర్ధంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిన నటి కరాటే కళ్యాణి
▪️ హరికథా గానంతో అలరించిన కళాకారులు
హైదరాబాద్: శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం, తెలుగు భాషా సాంస్కృతిక శాఖ, శ్రీ శృంగేరి శారద శంకరమఠం సంయుక్త ఆధ్వర్యంలో హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాస వరేన్యుల 81వ వర్ధంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ నెల 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు వారం రోజుల పాటు జరిగిన ‘రామాయణ హరికథా సప్తాహం’ ఆధ్యాత్మిక, సాంస్కృతిక చైతన్యాన్ని నింపింది.
కళాకారులకు అండగా కరాటే కళ్యాణి
కార్యక్రమ నిర్వాహకురాలు, శ్రీ ఆదిభట్ల శ్రీకళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షురాలు, నటి కరాటే కళ్యాణి చేస్తున్న కృషిని ప్రముఖ నటులు సుమన్ తల్వార్ కొనియాడారు. అంతరించిపోతున్న హరికథా కళారూపాన్ని కాపాడటంలో కళ్యాణి ముందుంటున్నారని, తన తండ్రి స్ఫూర్తితో ఏటా జయంతి, వర్ధంతి వేడుకలను నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
గతంలో 108 గంటల పాటు నిరంతర హరికథా గానంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించడమే కాకుండా, కరోనా కష్టకాలంలోనూ జూమ్ యాప్ ద్వారా ఆన్లైన్ ప్రదర్శనలు ఇచ్చి కళాకారులను ఆదుకున్న వైనాన్ని పలువురు ప్రముఖులు గుర్తుచేసుకున్నారు.
ఆధ్యాత్మిక చైతన్యానికి మద్దతు
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ఆదిభట్ల వారు రాసిన ‘యదార్థ రామాయణం’ కథాగానాన్ని వినడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ముగింపు ఉత్సవంలో భాగంగా ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు, పద్మశ్రీ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావుని ఘనంగా సత్కరించారు.
చివరి రోజు ఉత్సవం సద్గురు త్యాగరాజ స్వామి, ఆదిభట్ల వారి ఆరాధనతో ప్రారంభమైంది. భక్తిభావంతో నగర సంకీర్తన నిర్వహించారు. గాయకులు పంచరత్న కీర్తనలతో నీరాజనాలు సమర్పించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు పడాల తారకరామారావు తొలిసారిగా హరికథా గానం చేసి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన కథాగానం వింటుంటే తన తండ్రిని చూస్తున్నట్లుగా ఉందని కళ్యాణి భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. విజయనగరంలో నిర్మించబోయే ఆలయం మరియు హరికథా పాఠశాల ఏర్పాటు తన తండ్రి ఆశయమని, వీటిని పూర్తి చేసేందుకు దాతలు, కళాభిమానులు సహకరించాలని కోరారు. తన పిలుపును అందుకుని విచ్చేసిన రాజకీయ, సినీ ప్రముఖులకు మరియు తోటి కళాకారులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.






