Municipal Elections: కొట్టుకున్నారు.. కలిసిపోయారు.. తెలంగాణ రాజకీయాల్లో ‘బీ’ టీమ్ గోలకు ఎండ్ కార్డు!
Municipal Elections: తెలంగాణ మున్సిపల్ పీఠాల దక్కించుకునే క్రమంలో రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు తెరలేపాయి. ప్రచారంలో ఒకరినొకరు ‘బీ-టీమ్’ అని విమర్శించుకున్న పార్టీలు, ఇప్పుడు అధికార కుర్చీ కోసం బద్ధశత్రువులతో కూడా చేతులు కలుపుతున్నాయి. సిద్ధాంతాలను పక్కనపెట్టి, కేవలం పీఠమే లక్ష్యంగా సాగుతున్న ఈ పరిణామాలు ఓటర్లను విస్మయానికి గురిచేస్తున్నాయి.
ప్రధాన మున్సిపాలిటీల్లో పరిస్థితులు:
నర్సాపూర్‌లో కాంగ్రెస్-బీజేపీ దోస్తీ: నర్సాపూర్ మున్సిపాలిటీలో అందరినీ ఆశ్చర్యపరిచే పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ను అడ్డుకోవడానికి జాతీయ స్థాయిలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి. మొత్తం 15 వార్డులలో కాంగ్రెస్‌కు 6, బీఆర్ఎస్కు 5, బీజేపీకి 4 స్థానాలు రాగా.. హంగ్ ఏర్పడింది. దీంతో కాంగ్రెస్, బీజేపీ కలిసి పీఠాన్ని దక్కించుకున్నాయి. ఛైర్‌పర్సన్‌గా కాంగ్రెస్‌కు చెందిన మాచునూరి లక్ష్మి, వైస్ ఛైర్మన్‌గా బీజేపీకి చెందిన బుచ్చేశ్ యాదవ్ ఎన్నికయ్యారు.
కామారెడ్డిలో కాంగ్రెస్-బీఆర్ఎస్ మైత్రి: రాష్ట్ర రాజకీయాల్లోనే అత్యంత అరుదైన పరిణామం కామారెడ్డిలో కనిపించింది. అక్కడ బీజేపీని అడ్డుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు జతకట్టాయి. మెజార్టీ లేని స్థితిలో బీజేపీకి అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్ అభ్యర్థి ఇప్ప ఉమారాణికి మద్దతు ప్రకటించారు. ప్రచారంలో ఒకరినొకరు ‘బి-టీమ్‘ అని దూషించుకున్న పార్టీలు, అధికారం కోసం కలిసిన తీరుపై ప్రజల్లో చర్చ జరుగుతోంది.
ఇవి కూడా చదవండి

ఇస్నాపూర్‌లో బీఆర్ఎస్ మార్క్ పాలిటిక్స్: ఇస్నాపూర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందని ధీమాగా ఉన్న ఆ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గట్టి షాక్ ఇచ్చారు. 26 వార్డుల్లో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ లేకపోవడంతో, స్వతంత్రులతో పాటు కాంగ్రెస్ కౌన్సిలర్‌ను కూడా తమ వైపు తిప్పుకుని బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. నీలం మధు సతీమణి కవితను చైర్మన్ చేయాలన్న కాంగ్రెస్ వ్యూహాన్ని బీఆర్ఎస్ చిత్తు చేసింది.
జనగామలో ఉత్కంఠ: జనగామలో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారింది. ఇక్కడ కాంగ్రెస్బీ, ఆర్ఎస్ బలాబలాలు దాదాపు సమానంగా ఉండటంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు నిర్ణయాత్మక శక్తిగా మారారు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిలు తమ తమ పార్టీల అభ్యర్థులను గెలిపించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, క్యాంపు రాజకీయాలు స్థానికంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.
ఈ పరిణామాలు గమనిస్తే రాజకీయాల్లో “శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు.. కేవలం అధికారం మాత్రమే శాశ్వతం” అన్న మాట అక్షరాలా నిజమనిపిస్తోంది. ఢిల్లీ స్థాయిలో ఒకరిపై ఒకరు పోరాడే పార్టీలు, స్థానిక పీఠం కోసం గల్లీలో ఒక్కటవుతున్నాయి. ఈ ‘అడ్జస్ట్మెంట్’ రాజకీయాల పట్ల సామాన్య ప్రజల్లో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి













