TTD: ఏడుకొండల వాడి సన్నిధిలో వివాహాలు..తిరుపతిని వెడ్డింగ్ హబ్‌గా మార్చే ప్రయత్నం
కలియుగ ప్రత్యక్ష దైవంగా భక్తులు భావించే వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల (Tirumala)లో వివాహం చేసుకోవడం అత్యంత పవిత్రమని చాలామంది విశ్వసిస్తారు. ఆ పవిత్ర వాతావరణంలో కొత్త జీవితం ప్రారంభిస్తే దాంపత్య జీవితం సుఖశాంతులతో, ఆరోగ్యంగా సాగుతుందని భక్తుల నమ్మకం. ప్రపంచ వ్యాప్తంగా పేరుగాంచిన ఆధ్యాత్మిక క్షేత్రం కావడంతో, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం వివాహ జీవితానికి శుభకారకమని భావిస్తారు. ఏడుకొండల వాడి సన్నిధిలో జరిగే పెళ్లిని ఎంతో పవిత్రంగా కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు గౌరవిస్తారు.
ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుమల–తిరుపతి (Tirumala–Tirupati) ప్రాంతాన్ని వివాహాల కోసం ప్రత్యేక గమ్యస్థానంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇటీవల సంక్రాంతి పండుగ సందర్భంగా తన స్వగ్రామం నారావారిపల్లె (Naravaripalle)కు వెళ్లిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) తిరుపతిని వెడ్డింగ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దే దిశగా అధికారులకు సూచనలు చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి ఆదేశాలతో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) అధికారులు, పర్యాటక శాఖ (Tourism Department) కలిసి ప్రత్యేక ప్యాకేజీపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతం తిరుమలలో ఏటా సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల వరకు వివాహాలు జరుగుతున్నాయి. శుభ ముహూర్తాలు ఉన్న రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుంది. తిరుపతి (Tirupati), తిరుచానూరు (Tiruchanur) ప్రాంతాల్లో జరిగే పెళ్లిళ్లు వీటికి అదనమే.
ఇప్పటికే టీటీడీ (TTD) వివాహాలు చేసుకునే జంటలకు కొన్ని సౌకర్యాలు అందిస్తోంది. ‘కళ్యాణ వేదిక’ (Kalyana Vedika)లో వివాహం చేసుకున్న వారికి ప్రత్యేక దర్శన అవకాశం, ఆశీర్వచన కార్యక్రమం, ప్రసాదాల పంపిణీ వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే ఈ వేదికలో ఆర్భాటాలకు అవకాశం తక్కువగా ఉండటంతో, కొందరు భక్తులు కొండపై ఉన్న ప్రైవేటు మఠాలు, సత్రాలు లేదా దిగువ ప్రాంతాల్లోని కల్యాణ మండపాలను ఎంచుకుంటున్నారు. తొండవాడ (Thondawada), శ్రీనివాసమంగాపురం (Srinivasamangapuram) వంటి ప్రాంతాలు కూడా పెళ్లిళ్లకు ప్రాధాన్యం పొందుతున్నాయి.
అయితే ఈ విధంగా ఇతర చోట్ల వివాహాలు చేసుకునే వారికి ఇప్పటివరకు ప్రత్యేక దర్శన సౌకర్యాలు లేకపోవడం వల్ల భక్తుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ అంశం ప్రభుత్వ దృష్టికి రావడంతో, ఇకపై కళ్యాణ వేదిక వెలుపల పెళ్లి చేసుకున్నా కూడా శ్రీవారి దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదాలు అందించే విధంగా కొత్త విధానం తీసుకురావాలని యోచిస్తోంది.
వివాహ వేదిక అలంకరణ, భోజన ఏర్పాట్లు, రవాణా, వసతి వంటి సేవలను ప్రైవేటు సర్వీసు ప్రొవైడర్లకు అప్పగించి, ప్రభుత్వ పర్యవేక్షణలో ప్యాకేజీగా అందించాలని ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. దీని వల్ల పెళ్లి చేసుకునే వారికి సౌలభ్యం కలగడంతో పాటు, స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలుపితే, తిరుమల–తిరుపతి ప్రాంతం ఆధ్యాత్మికతతో పాటు వివాహాల కోసం కూడా దేశవ్యాప్తంగా మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.






