TTD: శ్రీవారి లడ్డూ నెయ్యి కల్తీ కేసు మలుపు… అధికార పార్టీలోని నేతల వరకు సీబీఐ విచారణ వస్తుందా?
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా, న్యాయపరంగా కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు అరెస్టులు జరగగా, ఇప్పుడు అధికార పార్టీలోని ముఖ్య నేతలపై కూడా విచారణ వచ్చే అవకాశాలపై చర్చ నడుస్తోంది. ముఖ్యంగా అప్పట్లో తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams – TTD) బోర్డు సభ్యులుగా పనిచేసిన కొందరు ప్రస్తుత మంత్రులు, ఎమ్మెల్యేలు సీబీఐ ప్రత్యేక దర్యాప్తు బృందం (CBI SIT) ప్రశ్నలకు లోనవుతారా అనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
గత ప్రభుత్వ కాలంలో శ్రీవారి లడ్డూల తయారీకి సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని ప్రస్తుత ప్రభుత్వం ఆరోపణలు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) బహిరంగంగా ప్రస్తావించడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. శ్రీవారి ప్రసాదం అనేది కోట్లాది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉండటంతో ఈ అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court ) కూడా సీరియస్గా స్పందించింది. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (Y V Subba Reddy) దాఖలు చేసిన పిటిషన్పై స్పందించిన సుప్రీంకోర్టు, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
దీంతో రంగంలోకి దిగిన సీబీఐ సిట్ అధికారులు నెయ్యి సరఫరాకు సంబంధించిన ఒప్పందాలు, టెండర్లు, కమిటీ నిర్ణయాలపై లోతుగా విచారణ చేపట్టారు. ఉత్తరాఖండ్ (Uttarakhand) కు చెందిన భోలే బాబా డెయిరీ (Bhole Baba Dairy)తో పాటు ఆ సంస్థతో లావాదేవీలు నిర్వహించిన వ్యక్తులను ఇప్పటికే అరెస్టు చేశారు. అదేవిధంగా టీటీడీ మాజీ చైర్మన్ కార్యాలయంలో పని చేసిన చిన్నఅప్పన్న అనే వ్యక్తిని కూడా విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే టీటీడీ మాజీ బోర్డు సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి (Chevireddy Bhaskar Reddy)ని సీబీఐ అధికారులు విజయవాడ (Vijayawada) జిల్లా జైలులో ప్రశ్నించారు. సుమారు నాలుగు గంటల పాటు సాగిన ఈ విచారణలో, అప్పట్లో నెయ్యి సరఫరాకు సంబంధించి ఏర్పాటైన సిఫార్సుల కమిటీ పాత్రపై కీలక వివరాలు వెలువడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ కమిటీలో చెవిరెడ్డితో పాటు ప్రస్తుత సమాచార శాఖ మంత్రి పార్థసారథి (Parthasarathi) , కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి (Vemireddy Prasanthi Reddy) సభ్యులుగా ఉన్నారని చెబుతున్నారు.
ఈ కమిటీ సూచనల ఆధారంగానే రోజువారీ నెయ్యి సరఫరా కోసం కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేశారని ఆరోపణలు ఉన్నాయి. అందుకే సీబీఐ విచారణ పరిధి ఇప్పుడు అధికార పార్టీలోని నేతల వరకు విస్తరించే అవకాశముందన్న చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్రస్తుత మంత్రి, ఎమ్మెల్యేలను కూడా ప్రశ్నిస్తే, ఈ కేసు మరింత కీలక దశకు చేరుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు ఈ వ్యవహారంలో ప్రధానంగా ప్రతిపక్ష వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకుంటున్నా, విచారణ పరిధి పెరిగితే రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉందని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.






