JD & JP: సివిల్ సర్వెంట్లు రాజకీయాల్లో సక్సెస్ కాలేరా..?
సివిల్ సర్వీసెస్.. దేశంలోనే అత్యున్నత స్థాయి బాధ్యత. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులుగా వీరు వ్యవస్థను శాసిస్తారు, ఫైళ్ల మీద సంతకాలతో వేలమంది జీవితాలను మారుస్తారు. కానీ, అదే అధికారులు ఖాకీ లేదా తెల్ల చొక్కా వదిలేసి ఖద్దరు చొక్కా కట్టుకోగానే సీన్ రివర్స్ అవుతోంది. తాజాగా మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మినారాయణ ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి పలికి, ప్రైవేటు సంస్థలో చేరడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. అటు జయప్రకాశ్ నారాయణ నుంచి ఇటు లక్ష్మినారాయణ వరకు.. వీరి ప్రయాణాలు ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. సిస్టమ్‌ను బయట ఉండి మార్చడం వేరు, సిస్టమ్‌లో భాగంగా మారి రాజకీయ రొంపిలో నెగ్గుకురావడం వేరు అని రుజువు చేస్తున్నాయి.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి డాక్టర్ జయప్రకాశ్ నారాయణ. ‘లోక్ సత్తా’ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పాలనా సంస్కరణల కోసం పోరాడి, ఆ తర్వాత దానిని రాజకీయ పార్టీగా మార్చారు. జేపీ రాజకీయాల్లో ‘నైతికత’ గురించి మాట్లాడారు. కానీ భారతీయ ఓటరు నాడి కేవలం సిద్ధాంతాల మీద మాత్రమే పనిచేయదు. కుల, మత సమీకరణలు, ధన ప్రభావం ఉన్న రాజకీయ క్షేత్రంలో జేపీ మేధోమథనం సామాన్య ఓటరుకు చేరువ కాలేకపోయింది. కూకట్పల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, అసెంబ్లీలో ఆయన ఒంటరి అయ్యారు. చివరకు రాజకీయాల్లో తన గళం వినిపించే అవకాశం లేదని గ్రహించి, ప్రస్తుతం ఆయన కేవలం సామాజిక విశ్లేషకుడిగానే మిగిలిపోయారు.
సీబీఐ మాజీ జేడీగా లక్ష్మినారాయణ పేరు చెబితే అవినీతిపరుల వెన్నులో వణుకు పుట్టేది. ఆ క్రేజ్‌తోనే ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, గణనీయమైన ఓట్లు సాధించారు. కానీ అక్కడితోనే ఆయన గ్రాఫ్ ఆగిపోయింది. ముందుగా జనసేనలో చేరడం, ఆ తర్వాత రాజీనామా చేయడం, మళ్ళీ సొంతంగా జై భారత్ నేషనల్ పార్టీ పెట్టడం.. లాంటివన్నీ ప్రజల్లో అయోమయాన్ని సృష్టించాయి. పోలీసు అధికారిగా కఠినంగా ఉండటం అలవాటైన లక్ష్మినారాయణకు, రాజకీయాల్లో ఉండే అనునిత్యం రాజీపడే తత్వం సెట్ కాలేదు. రాజకీయాల్లో మార్పు తీసుకురావడం కంటే, ప్రైవేటు రంగంలో సేవ చేయడం ఉత్తమమని భావించి ఆయన ‘ఈవీ ట్రాన్స్’ సంస్థలో బాధ్యతలు చేపట్టారు. ఇది ఆయన రాజకీయ ప్రస్థానానికి దాదాపు ముగింపు పలికినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజకీయాల్లోకి వచ్చే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వైఫల్యానికి ఎన్నో కారణాలున్నాయి. అధికారులుగా ఉన్నప్పుడు వారి మాట శాసనం. అందరూ వారి కింద పని చేస్తారు. కానీ రాజకీయాల్లో ‘ప్రజల వద్దకు వెళ్లి అడుక్కోవాలి’. ఈ మనస్తత్వ మార్పు అందరికీ సాధ్యం కాదు. సివిల్ సర్వెంట్లు ప్రతిదీ చట్టబద్ధంగా, సిద్ధాంతపరంగా ఉండాలని కోరుకుంటారు. కానీ రాజకీయం అనేది ‘గెలుపే లక్ష్యం’గా సాగే చదరంగం. ఇక్కడ ఎథిక్స్ కంటే స్ట్రాటజీలకే ప్రాధాన్యత ఎక్కువ. రాజకీయ పార్టీ నడపాలంటే క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఉండాలి. అధికారులు కేవలం మీడియాలో కనిపించి ఓట్లు రాబట్టలేరు. జేపీ, జేడీ ఇద్దరూ ఈ విషయంలోనే వెనుకబడ్డారు.
సివిల్ సర్వెంట్లు రాజకీయాల్లోకి రావడం ప్రజాస్వామ్యానికి మంచిదే అయినా, క్షేత్రస్థాయి వాస్తవాలను గ్రహించకపోతే పరాజయం తప్పదని ఈ ఇద్దరి ఉదాహరణలు నిరూపిస్తున్నాయి. జేపీ మేధస్సు, జేడీ నిజాయితీ రాజకీయ వ్యవస్థకు అవసరమే, కానీ ఆ వ్యవస్థలో ఇమడలేక వారు వెనక్కి వెళ్లడం దురదృష్టకరం. వ్యవస్థను మార్చాలనే తపనతో వచ్చి, చివరకు వ్యవస్థ గాలికి కొట్టుకుపోవడం లేదా పక్కకు తప్పుకోవడం ఒక చేదు నిజం.













