Trisha: విజయ్, త్రిష రిలేషన్‌పై రచ్చ..! BJPపై ఫైర్..!!
తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం సినిమా, రాజకీయం కలగలిసి ఒక పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. ముఖ్యంగా దళపతి విజయ్ రాజకీయరంగ ప్రవేశం చేసిన తర్వాత, ఆయన వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రత్యర్థులు విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా బీజేపీ రాష్ట్ర నాయకుడు నైనార్ నాగేంద్రన్.. విజయ్, నటి త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో పెను సంచలనం సృష్టించాయి.
దళపతి విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ సత్తాను చాటాలనుకుంటున్నారు. ఈ క్రమంలో అధికార DMK, ప్రతిపక్ష పార్టీల విమర్శలకు ఆయన గురవుతున్నారు. అయితే, రాజకీయ విధానాలపై విమర్శలు చేయడం మానేసి, ఆయన వ్యక్తిగత జీవితంపై వ్యాఖ్యలు చేయడం ఈ వివాదానికి మూలమైంది.

ఇటీవల ఒక సందర్భంలో నైనార్ నాగేంద్రన్ మాట్లాడుతూ, విజయ్ వ్యక్తిగత ప్రవర్తనను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. “విజయ్ ముందు నటి త్రిషతో రిలేషన్ నుంచి బయటకు రావాలి.. అప్పుడే ఆయనకు రాజకీయ ప్రపంచం ఎలా ఉంటుందో అర్థమవుతుంది” అని నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యానించారు. త్రిష పేరును ప్రస్తావించడం సోషల్ మీడియాలో దావానంలా వ్యాపించింది. గత కొంతకాలంగా విజయ్, త్రిషల మధ్య ఏదో ఉందంటూ వస్తున్న పుకార్లకు రాజకీయ నాయకులు తోడవ్వడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది.
ఇవి కూడా చదవండి
విజయ్, త్రిషలు ‘గిల్లి’, ‘కురువి’, ‘తిరుపాచి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించారు. సుమారు 14 ఏళ్ల తర్వాత వారు మళ్లీ ‘లియో’ సినిమాలో కలిసి నటించడంతో వీరిద్దరి కెమిస్ట్రీ గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఇదే సమయంలో విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారనే పుకార్లు షికారు చేశాయి. ఈ రూమర్లను సాకుగా తీసుకుని, విజయ్ రాజకీయాల్లోకి వస్తే ఆయన నైతికతను ప్రశ్నించే నెపంతో ప్రత్యర్థులు త్రిష పేరును తెరపైకి తెచ్చారు.
సాధారణంగా తనపై వచ్చే రూమర్లపై మౌనంగా ఉండే త్రిష, ఈసారి మాత్రం గట్టిగానే స్పందించారు. తన పేరును రాజకీయ చదరంగంలోకి లాగడంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “రాజకీయ ప్రయోజనాల కోసం ఒక మహిళ గౌరవానికి భంగం కలిగించడం హేయమైన చర్య” అని ఆమె పేర్కొన్నారు. తన ప్రతిష్టకు భంగం కలిగించేలా మాట్లాడే వారిపై చట్టపరంగా వెనక్కి తగ్గబోనని ఆమె పరోక్షంగా హెచ్చరించారు. గతంలోనూ ఏవీ రాజు అనే రాజకీయ నాయకుడు తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు త్రిష కోర్టు మెట్లు ఎక్కిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆమె అదే స్థాయిలో స్పందిస్తూ మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడాలని కోరారు.

విజయ్ తన పార్టీ కార్యకర్తలకు ఒక స్పష్టమైన ఆదేశాన్ని ఇచ్చారు. విమర్శలను హుందాగా ఎదుర్కోవాలని సూచించారు. అయితే, నైనార్ నాగేంద్రన్ వ్యాఖ్యలపై TVK శ్రేణులు మండిపడ్డాయి. రాజకీయంగా విజయ్ను ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూడటం పిరికిపంద చర్య అని పార్టీ నేతలు విమర్శించారు. బీజేపీ నేతలు మహిళలను గౌరవించే విధానం ఇదేనా అని సోషల్ మీడియా వేదికగా నిలదీశారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే ఇలాంటి అనవసర వివాదాలను సృష్టిస్తున్నారని TVK ఆరోపించింది.
తమిళనాడులో సినిమా, రాజకీయం విడదీయలేనివి. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత కాలం నుండి నటీనటులపై వ్యక్తిగత విమర్శలు చేయడం రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఉంటూ వస్తోంది. విజయ్ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయడం వల్ల ఆయన అభిమానుల్లో ఆగ్రహం పెరగడమే కాకుండా, ఆయనకు సానుభూతి పెరిగే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా త్రిష వంటి సీనియర్ నటిని ఇలాంటి వివాదాల్లోకి లాగడం వల్ల మహిళా ఓటర్లలో ప్రతికూల భావన కలిగే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ వివాదం కేవలం త్రిష, విజయ్ లకే పరిమితం కాకుండా.. తమిళ రాజకీయాల్లో ఎంతటి దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయో చాటిచెబుతోంది.
ఇవి కూడా చదవండి













