Digital Hawala: జమ్మూకశ్మీర్లో డిజిటల్ హవాలా.. 8 వేల బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్!
జమ్మూకశ్మీర్లో భారీ డిజిటల్ హవాలా (Digital Hawala) నెట్వర్క్ గుట్టురట్టయింది. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు నిధులు మళ్లించేందుకు అంతర్జాతీయ సైబర్ సిండికేట్లు వాడుతున్న ఏకంగా 8 వేలకు పైగా ‘మ్యూల్ ఖాతాల’ను (నకిలీ అకౌంట్లు) అధికారులు గుర్తించి స్తంభింపజేశారు. గత మూడేళ్లుగా ఈ ఖాతాల ద్వారా భారీ ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది. గతంలో 2017లో ఎన్ఐఏ ఉగ్రవాద నిధులపై ఉక్కుపాదం మోపడంతో హవాలా ముఠాలు (Digital Hawala) తమ పంథా మార్చుకున్నాయి. దర్యాప్తు సంస్థల కళ్లుగప్పేందుకు ట్రేస్ చేయడానికి వీల్లేని డిజిటల్ హవాలాను, క్రిప్టోకరెన్సీని ఆశ్రయించాయి. చైనా, మలేషియా, మయన్మార్, కంబోడియా తదితర దేశాల్లో కూర్చున్న సైబర్ నేరగాళ్లు.. జమ్మూకశ్మీర్లోని కొందరు దళారుల (మ్యూలర్లు) సాయంతో ఇతరుల పేర్ల మీద మ్యూల్ ఖాతాలను, షెల్ కంపెనీలను తెరిచారు. ఏమాత్రం అనుమానం రాకుండా ఒక్కో షెల్ కంపెనీ ఖాతా నుంచి రోజుకు ఏకంగా రూ. 40 లక్షల వరకు ట్రాన్సాక్షన్లు జరిపారు. ఆ తర్వాత ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుందో అంతుచిక్కకుండా క్రిప్టోకరెన్సీ రూపంలోకి మార్చేశారు.
సైబర్ మోసాలకు, హవాలాకు (Digital Hawala) ఈ మ్యూల్ ఖాతాలే ప్రాణనాడి అని గుర్తించిన కేంద్ర భద్రతా సంస్థలు.. జమ్మూకశ్మీర్ పోలీసులు, బ్యాంకుల సమన్వయంతో ఈ భారీ నెట్వర్క్ బాగోతాన్ని బయటపెట్టాయి. ఈ ఖాతాలు లేకపోతే నేరస్థులు సొమ్మును దారి మళ్లించలేరు. ప్రస్తుతం ఈ అక్రమ లావాదేవీల వెనుక ఉండి, స్కామర్లకు అనుకూలంగా పనిచేస్తున్న ఆ ఏజెంట్లను (మ్యూలర్లను) పట్టుకునేందుకు దర్యాప్తు సంస్థలు గాలిస్తున్నాయి.













