Pawan Kalyan: బడ్జెట్ వేళ ఏపీ అభివృద్ధి అజెండాతో ఢిల్లీకి జనసేనాని..
ఏపీ ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister of Andhra Pradesh)గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎక్కువగా రాష్ట్రంలోనే ఉండి తన శాఖల పనులను పర్యవేక్షిస్తున్న విషయం తెలిసిందే. దాదాపు గత ఇరవై నెలల కాలంలో ఒకటి రెండు సందర్భాలు తప్ప ఆయన ఢిల్లీ (New Delhi) వెళ్లలేదు. పరిపాలనపై పూర్తి పట్టు సాధించాలనే ఉద్దేశంతో శాఖల పనితీరును దగ్గరుండి చూసుకుంటూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇదిలా ఉండగా, మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో పాటు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) తరచూ ఢిల్లీ పర్యటనలు చేస్తూ కేంద్ర మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈసారి పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారనే వార్త రాజకీయ వర్గాల్లో ఆసక్తిని కలిగిస్తోంది. కేంద్ర బడ్జెట్ సమావేశాల మధ్యలో ఆయన పర్యటన ఉండబోతుందని జనసేన లోక్‌సభాపక్ష నేత బాలశౌరి (Balashowry) వెల్లడించారు. ఈ పర్యటనలో పవన్ కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల మంత్రులతో విడిగా భేటీ అయ్యి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అభివృద్ధికి అవసరమైన నిధులపై చర్చించనున్నారని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధానిగా నిర్ణయించిన అమరావతి (Amaravati) నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని కేంద్రం నుంచి రాబట్టడం ఆయన ప్రధాన లక్ష్యంగా ఉండనుందని చెప్పారు.
అమరావతితో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు నిధులు అవసరమని పవన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లనున్నారని జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi), కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah)తో పవన్‌కు ఉన్న సాన్నిహిత్యాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకుంటారని పార్టీ నేతలు భావిస్తున్నారు. రాష్ట్రానికి పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టాల్సిన అవసరం ఉన్నందున ఈ పర్యటన ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
ఇటీవల కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా జనసేన తన అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేసింది. ఆ సమావేశంలో బాలశౌరి మాట్లాడుతూ అమరావతికి చట్టబద్ధత కల్పించేలా కేంద్రం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే యువతలో పెరుగుతున్న డ్రగ్స్ సమస్యపై తల్లిదండ్రుల్లో ఉన్న ఆందోళనను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. డ్రగ్స్ నియంత్రణతో పాటు సోషల్ మీడియా దుర్వినియోగంపై కఠిన చట్టాలు అవసరమని, వీటిపై పార్లమెంట్లో చర్చ జరగాలని జనసేన అభిప్రాయపడింది.
అదేవిధంగా జల జీవన్ మిషన్ (Jal Jeevan Mission) కింద ప్రతి గ్రామానికి తాగునీరు అందించే లక్ష్యంతో అన్ని జిల్లాలకు సరిపడా నిధులు కేటాయించాలని కోరింది. ఆక్వా కల్చర్ రంగంపై అమెరికా (United States of America) విధిస్తున్న పన్నుల ప్రభావం తీవ్రంగా ఉందని, ఆక్వా రైతుల సమస్యలపై పార్లమెంట్లో విస్తృత చర్చ జరిపి పరిష్కారం చూపాలని జనసేన కేంద్రాన్ని అభ్యర్థిస్తోంది. ఈ అన్ని అంశాలతో పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.






