Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని (Rani Kumudini) హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో షెడ్యూల్ విడుదల చేశారు. అనంతరం ఎన్నికల ప్రక్రియను వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా 7 మున్సిపల్ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల్లోని 2,996 వార్డుల్లో ఒకే విడతలో ఫిబ్రవరి 11న ఎన్నికలు నిర్వహించబోతున్నట్టు చెప్పారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్, 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని వివరించారు. నేటి నుంచి 30 వరకు నామినేషన్లను (Nominations) స్వీకరిస్తామన్నారు. జనవరి 31న నామినేషన్ల పరిశీలన, ఫిబ్రవరి 3న తుది అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. పోలింగ్లో ఏవైనా అవాంతరాలు జరిగితే 12న రీ పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 14న మేయర్, డిప్యూటీ మేయర్, చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక కోసం సంబంధిత కలెక్టర్ (Collector) నియమించిన అధికారి ప్రత్యేక సమావేశం కోసం నోటిఫికేషన్ విడుదల చేస్తారని వివరించారు. ఫిబ్రవరి 16న ప్రమాణ స్వీకారం అనంతరం ఎన్నిక నిర్వహిస్తారనీ, ఏదైనా కారణం చేత ఎన్నిక వీలు కాకుంటే మరుసటి రోజు ఫిబ్రవరి 17న నిర్వహిస్తామని చెప్పారు.






