Singareni Scam: సింగరేణి స్కామ్ కు కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం.. అన్నీ ఆ పార్టీయే
సింగరేణి స్కామ్ (Singareni scam) కు కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం అన్నీ బీఆర్ఎస్సేనని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ఆరోపించారు. ఢిల్లీలో మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. సింగరేణిలో కాంట్రాక్టు పొందిన సృజన్‌రెడ్డి (Srujan Reddy) బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి (Upender Reddy) అల్లుడేనన్నారు. సృజన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్ పెద్దఎత్తున మనీ లాండరింగ్‌కు పాల్పడిందని తెలిపారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడిందో, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కవిత స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. నైనీ బ్లాక్ టెండర్ల వివాదం పూర్తిగా మీడియా సృష్టేనని పేర్కొన్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో ఎటువంటి చర్చలు జరగలేదని తెలిపారు. మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక మునిసిపాలిటీలను తామే గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్, మునిసిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు దొరకని దుస్థితిలో కొట్టుమిట్టాడుతోందని ఎద్దేవా చేశారు. ప్రత్యేకించి నిజామాబాద్‌లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు నాయకులు భయపడుతున్నారని, కనీసం డిపాజిట్లు కూడా రావేమోనని ఆందోళన చెందుతున్నారని అన్నారు.






