YCP vs TDP: అంబటి రాంబాబు ఇంటి వద్ద రణరంగం.. మాజీ మంత్రికి చెప్పు చూపించిన లంకా మాధవి.. అరెస్ట్ వార్తలతో హై టెన్షన్!
గుంటూరు: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత అంబటి రాంబాబు నివాసం వద్ద ఆదివారం యుద్ధ వాతావరణం నెలకొంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఉద్దేశించి అంబటి చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు ఈ వివాదానికి మూల బిందువుగా మారాయి. ఈ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అంబటిపై కేసు నమోదైంది. ఈ క్రమంలో ఆయనను పోలీసులు ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్తలు గుప్పుమనడంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపుతప్పింది.
చెప్పు చూపించిన లంకా మాధవి
ఈ వివాదం కొనసాగుతుండగానే, టీడీపీ నేత లంకా మాధవి అంబటి రాంబాబు నివాసానికి సమీపంలో నిరసన చేపట్టారు. ఆ సమయంలో అంబటిని ఉద్దేశించి ఆమె తన చెప్పు చూపించడంతో పరిస్థితి అత్యంత ఉద్రిక్తంగా మారింది. ఆమె చర్యతో ఆగ్రహానికి గురైన వైసీపీ శ్రేణులు మాధవిపై దాడి చేసేందుకు యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని, ఆమెను అక్కడి నుండి సురక్షితంగా తరలించే ప్రయత్నం చేశారు.
కార్యకర్తల మోహరింపు
మరోవైపు అంబటి రాంబాబు అరెస్ట్ తప్పదని భావించిన వైసీపీ కార్యకర్తలు, అనుచరులు భారీ సంఖ్యలో ఆయన నివాసానికి చేరుకున్నారు. “అంబటిని అరెస్ట్ చేస్తే ఊరుకోం” అంటూ నినాదాలు చేశారు. అటు టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు గుంటూరులోని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
పోలీసుల భారీ బందోబస్తు
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి అంబటి నివాసానికి వెళ్లే దారులను మూసివేశారు. అంబటి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయని టీడీపీ ఆరోపిస్తుండగా, ప్రభుత్వం కావాలనే తమ నేతలపై అక్రమ కేసులు పెడుతోందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ గంభీర పరిస్థితి నెలకొంది.






