Ambati vs TDP: గుంటూరులో రణరంగం.. అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ శ్రేణుల దాడి.. కారు, ఆఫీస్ ధ్వంసం! టెన్షన్ టెన్షన్!
గుంటూరు: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు గుంటూరులో చిచ్చు రేపాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి అత్యంత అసభ్యకరంగా మాట్లాడటంతో ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ కార్యకర్తలు, తెలుగు మహిళలు ఒక్కసారిగా ఆయన నివాసాన్ని చుట్టుముట్టారు. అంబటి బయటకి వచ్చి క్షమాపణలు చెప్పాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. నిరసన కాస్తా హింసాత్మకంగా మారడంతో అంబటి రాంబాబు నివాసం వద్ద యుద్ధ వాతావరణం కనిపిస్తోంది.
కారు, ఆఫీసు ధ్వంసం
వందలాదిగా తరలివచ్చిన టీడీపీ శ్రేణులు అంబటి రాంబాబు నివాసం లోపలికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇంటి ఆవరణలో ఉన్న అంబటి కారును, ఆయన వ్యక్తిగత కార్యాలయాన్ని ఆందోళనకారులు ధ్వంసం చేశారు. రాళ్లతో దాడి చేయడంతో ఇంటి కిటికీ అద్దాలు, కారు అద్దాలు ముక్కలయ్యాయి. అంబటి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే ఇక్కడి నుండి కదిలేది లేదని టీడీపీ నేతలు భీష్మించుకుని కూర్చున్నారు.
చేతులెత్తేసిన పోలీసులు
ఘటన స్థలంలో పోలీసులు ఉన్నప్పటికీ, ఆందోళనకారుల ఉధృతి ముందు వారు అదుపు చేయలేకపోయారు. పోలీసుల వలయాన్ని ఛేదించుకుని కార్యకర్తలు లోపలికి వెళ్లడంతో పరిస్థితి చేయి దాటిపోయింది. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం గుంటూరులోని ఆ ప్రాంతమంతా పోలీసుల ఆధీనంలో ఉన్నప్పటికీ, ఉద్రిక్తత మాత్రం తగ్గడం లేదు.
అంబటి వివరణ.. అయినా తగ్గని వేడి
ఈ పరిణామాలపై అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు. తాను ఉద్దేశపూర్వకంగా చంద్రబాబును తిట్టలేదని, తన కారును అడ్డుకుని తనను బూతులు తిడుతున్న వారిపై ఆవేశంలో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. “ఈ వయసులో, ఈ హోదాలో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు” అని అంగీకరించినప్పటికీ, అరెస్టులకు తాను భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు, లోకేష్ లేదా రెడ్ బుక్కు తన కుక్క కూడా భయపడదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు మళ్లీ మంట పుట్టించాయి.
ప్రస్తుతం అంబటి నివాసం వద్ద అదనపు బలగాలను మోహరించారు. అరెస్ట్ ప్రచారం, దాడుల నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకుంటుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది.






