US Govt: సొంత ప్రభుత్వం పైనా ట్రంప్ దావా.. ! వెయ్యి కోట్ల పరిహారం కావాలట..!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. తనకు కోపం తెప్పిస్తే ఎవరైనా… ఆయన ఆగ్రహానికి గురికావాల్సిందే. ఇటీవలే బీబీసీపై దావా వేసి, ఆసంస్థ ఆర్థిక మూలాలను టార్గెట్ చేశారు ట్రంప్. సంస్థ క్షమాణపలు చెప్పినా కుదరదని తేల్చేశారు. ఇప్పుడు అదే విధంగా ఏకంగా తన ప్రభుత్వంపైనా విచిత్రంగా దావా వేశారు. ఈపని ఇంకే అధ్యక్షుడు చేయలేరు. ఒక్క ట్రంప్ కు మాత్రమే సాధ్యం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశ అంతర్గత రెవెన్యూ సేవలు (ఐఆర్ఎస్), ఆర్థిక (ట్రెజరీ) విభాగాలపై కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు సంబంధించిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్నుల సమాచారం లీక్ కాకుండా నిరోధించడంలో ఈ రెండు విభాగాలూ విఫలమయ్యాయని ఆరోపించారు ట్రంప్. అందుకు వెయ్యి కోట్ల డాలర్ల నష్ట పరిహారం చెల్లించాలని ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దాఖలు చేసిన దావాలో పేర్కొన్నారు. ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్లు, వారి కుటుంబానికి చెందిన ట్రంప్ సంస్థలే ఈ కేసులో ఫిర్యాదుదారులు.
2024లో ట్రంప్‌నకు సంబంధించిన పన్నుల సమాచారాన్ని లీక్ చేశారన్న ఆరోపణపై ఐఆర్ఎస్ మాజీ కాంట్రాక్టర్ చార్లెస్ ఎడ్వర్డ్ లిలిల్ జాన్ అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించారు. ఈ సమాచారాన్ని లిలిల్జాన్ 2018, 2020 మధ్య కాలంలో ‘‘ద న్యూయార్క్ టైమ్స్’’, ‘‘ప్రొ పబ్లికా’’ మీడియా సంస్థలకు అందించారని ప్రాసిక్యూషన్ అభియోగం. జాన్ చర్యలు ఓటర్లపై ప్రభావం చూపి 2020 అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓటమికి కారణమైందని దావాలో పేర్కొన్నారు.జాన్ లీక్ చేసిన సమాచారం తన ప్రతిష్ఠను దెబ్బతీయడంతోపాటు ఆర్థిక నష్టాన్ని కలిగించిందని ట్రంప్ పేర్కొన్నారు.
జాన్‌కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన పనిచేసిన బూజ్ అలన్ హ్యామిల్టన్ సంస్థతో అమెరికా ఆర్థిక శాఖ ఈ వారం తెగతెంపులు చేసుకుంది. శిక్షకు గురైన జాన్ ట్రంప్‌తో పాటు అమెరికాకు చెందిన వేల మంది ధనికుల పన్ను సమాచారంపై కూడా మీడియా సంస్థలకు ఉప్పందించాడు. ఈ సమాచారం లీక్ కావడాన్ని నిలువరించడంలో రెండు ప్రభుత్వ విభాగాలూ విఫలమయ్యాయని తాజా దావాలో ఫిర్యాదుదారులు ఆరోపించారు.






