భానుడి దెబ్బకు అల్లాడిపోతున్న ఏపీ..!
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Heat Wave) మండిపోతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ఉభయ రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత మొదలై, మధ్యాహ్నానికి ప్రమాదకరమైన రీతిలో వడగాల్పులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి జంకుతున్నారు. రాబోయే మరో రెండు, మూడు రోజుల పాటు ఎండల తీవ్రత ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
తెలంగాణ(Telangana) వ్యాప్తంగా ఎండల తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాష్ట్రంలోని మొత్తం 19 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా నమోదు కావడం గమనార్హం. ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వేడి తీవ్రత మరీ ఎక్కువగా ఉంది. వడగాల్పుల తీవ్రమైన హెచ్చరికల నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు, వైద్యులు ప్రత్యేకంగా హెచ్చరిస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్(ఏపీ)లోనూ ఎండల పరిస్థితి దారుణంగా ఉంది.
రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల మార్కును దాటేశాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదై రికార్డు సృష్టించింది. అలాగే కృష్ణా జిల్లా కంకిపాడులో(kankipadu) 46.1 డిగ్రీలు, ప్రకాశం జిల్లా మార్కాపురం పరిధిలోని నందనమారెళ్లలో 46.1 డిగ్రీలు, పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఎక్కువ మొత్తంలో ఓఆర్ఎస్, మంచినీరు, మజ్జిగ, కొబ్బరినీళ్లు లాంటి ద్రవపదార్థాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి







