అనంతబాబు దంపతులకు బిగుస్తున్న ఉచ్చు..!
ఏపీలో తీవ్ర సంచలనం సృష్టించిన డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసు విచారణ రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో రెండో రోజుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ(YSRCP) నేత.. అనంత ఉదయ భాస్కర్ (అనంతబాబు)తో పాటు ఆయన భార్య లక్ష్మీదుర్గను పోలీసులు ఈరోజు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. గతంలో తన వద్ద డ్రైవర్గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను అనంతబాబు స్వయంగా హత్య చేసి, ఆ తర్వాత రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని బాధితుడి ఇంటికి తీసుకెళ్లారనే ఆరోపణలపై అప్పట్లో తీవ్ర దుమారం రేగింది.
రెండో రోజు కోర్టు విచారణ ప్రక్రియలో భాగంగా కేసులో అత్యంత కీలకమైన ముగ్గురు సాక్షులను పోలీసులు న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ముప్పాళ్ల సుబ్బారావు, డిఫెన్స్ లాయర్ల సమక్షంలో ఈ సాక్షుల యొక్క వాంగ్మూలాలను న్యాయమూర్తి క్షుణ్ణంగా రికార్డ్ చేయనున్నారు. సుబ్రహ్మణ్యం మరణం వెనుక ఉన్న అసలు నిజాలను, సాంకేతిక ఆధారాలను నిరూపించడానికి ఈ ముగ్గురు సాక్షుల వాంగ్మూలాలు ప్రాసిక్యూషన్కు ఎంతో కీలకంగా మారనున్నాయి.
కోర్టులో సాక్షుల విచారణ ప్రక్రియ వేగవంతం కావడంతో ఈ కేసు తుది తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంచేనీయ సంఘటనలు జరగకుండా, నిందితుల అనుచరులు లేదా బాధితుడి బంధువుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా రాజమహేంద్రవరం ప్రత్యేక న్యాయస్థానం ప్రాంగణం వద్ద పోలీసులు పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. కోర్టు పరిసరాల్లోకి వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనంతబాబును అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి







