మే 31న తానా ప్రపంచ సాహిత్య వేదిక 6వ వార్షికోత్సవం..
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో ‘తానా ప్రపంచ సాహిత్య వేదిక‘ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నెల నెలా నిర్వహించే ‘తెలుగు వెలుగు’ సదస్సులలో భాగంగా.. ఈసారి సంస్థ 6వ వార్షికోత్సవాన్ని 92వ అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాన్ని అత్యంత ఘనంగా నిర్వహించనుంది. ఈ అంతర్జాతీయ వర్చువల్ సదస్సు 2026 మే 31వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ ఏడాది సదస్సు కోసం “ప్రాచీన భారతీయ వేదవిజ్ఞానం – ఆధునిక శాస్త్ర, సాంకేతిక ఆవిష్కరణలకు మూలం” అనే ఆసక్తికరమైన అంశాన్ని నిర్వాహకులు ఎంచుకున్నారు.
ముఖ్య అతిథిగా…
భారతీయ సనాతన ధర్మం, వేద విజ్ఞాన విశేషాలను ప్రపంచవ్యాప్తంగా చాటిచెబుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త, సాహిత్యవేత్త, కవి పండితులు, ‘రుషిపీఠం’ ఆధ్యాత్మిక పత్రిక సంపాదకులు అయిన బ్రహ్మశ్రీ డా.సామవేదం షణ్ముఖ శర్మ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు.
ఇవి కూడా చదవండి
వీరితో పాటు ఈ సదస్సులో పలువురు విశిష్ట అతిథులు కూడా పాల్గొని ప్రసంగించనున్నారు:
- ‘భారతీయం’ (గొట్టిపాటి) సత్యవాణి: భారతీయ సంప్రదాయ పరిరక్షణ ప్రచారకర్త.
- డా. గరికిపాటి గురుజాడ: సహాయ ఆచార్యులు, తెలుగు శాఖ, ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, అనంతపురం.
- డా. భువనగిరి సత్య సింధుజ: ప్రముఖ చక్రసిద్ధ వైద్యురాలు.
- డా. సత్య హనుమ శ్రీ: ప్రముఖ మానసిక విశ్లేషకురాలు ‘విధాత్రి ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలు.
ప్రత్యక్ష ప్రసార సమయం..
ఈ అంతర్జాతీయ దృశ్య సమావేశం వివిధ కాలమానాల ప్రకారం కింది సమయాల్లో ప్రారంభమవుతుంది:
భారతదేశం (IST): రాత్రి 7:30 గంటలకు (మే 31, ఆదివారం)
అమెరికా (PST): ఉదయం 7:00 గంటలకు
అమెరికా (CST): ఉదయం 9:00 గంటలకు
అమెరికా (EST): ఉదయం 10:00 గంటలకు
ఈ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగులో చూసేందుకు YuppTV లోని “తానా ప్రపంచ సాహిత్య వేదిక” టీవీ ఛానెల్ ద్వారా, అలాగే టోరి (ToRE) తెలుగువన్, ఈటీవీ భారత్ (ETV Bharat) ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
ఈ వేడుకను విజయవంతం చేయడానికి తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషాభిమానులు, శాస్త్ర విజ్ఞాన ప్రియులు ఈ సదస్సులో పాల్గొనాలని నిర్వాహక బృందం పిలుపునిచ్చింది.







