యాక్షన్ సీక్వెన్స్ కోసం అంత లాంగ్ షెడ్యూలా?
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli)- సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu) కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi)పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌తో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ సినిమా ఇప్పుడు తన యాక్షన్ ఎపిసోడ్లతో మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. జూన్ రెండో వారం నుంచి ప్రారంభమయ్యే కీలక షెడ్యూల్లో మహేష్ బాబుపై భారీ స్థాయిలో యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించనున్నట్టు సమాచారం. ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఈ యాక్షన్ బ్లాక్స్ కోసం నెలకు పైగా షూటింగ్ ప్లాన్ చేయడం సినిమా స్కేల్‌ను మరో స్థాయికి తీసుకెళ్తోంది. ముఖ్యంగా హాలీవుడ్ స్టాండర్డ్స్‌ను టార్గెట్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సీన్స్ సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ సినిమాలో మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయడం కూడా ఆసక్తిని మరింత పెంచుతోంది. ఒకవైపు రుద్రగా మాస్ షేడ్స్‌లో కనిపిస్తూనే, మరోవైపు శ్రీరాముడు పాత్రలో ఆధ్యాత్మిక భావజాలాన్ని ప్రతిబింబించనున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక ప్రియాంక చోప్రా(Priyanka Chopra) మందాకిని పాత్రలో కనిపించనుండటం సినిమాకు గ్లోబల్ అప్పీల్ తీసుకొస్తోంది. కథలో పురాణాల స్పర్శతో పాటు అడ్వెంచర్, మిస్టిక్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఉండబోతున్నాయనే ప్రచారం అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. రాజమౌళి మార్క్ విజువల్ గ్రాండియర్‌తో పాటు ఎమోషన్స్ కు కూడా సమాన ప్రాధాన్యం ఉండబోతుందన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.
రూ.1300 కోట్లకు పైగా బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాను నిర్మాత కె.ఎల్. నారాయణ(KL Narayana), ఎస్.ఎస్. కార్తికేయ(SS Karthikeya) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా, కథను విజయేంద్ర ప్రసాద్(Vijayendra Prasad) రూపొందించారు. సంభాషణలను దేవా కట్టా(Deva Katta) అందిస్తున్నారు. పూర్తిగా ఐమ్యాక్స్(IMAX) ఫార్మాట్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను పలు భాషల్లో 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.







