హైదరాబాద్‌పై ‘కేటీఆర్’ వ్యూహాత్మక గాలం!
తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత BRS తన తదుపరి ప్రధాన లక్ష్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై గురిపెట్టింది. కూకట్‌పల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, ప్రకటించిన హామీలు పూర్తిగా గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా సాగాయి. గత ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు తమకు అందించిన తిరుగులేని మద్దతును కాపాడుకుంటూనే, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా నగరంలో పట్టు బిగించాలని బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
హైదరాబాద్ నగర అభివృద్ధిలో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకం. గత బీఆర్ఎస్ పాలనలో నగరానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందించామని గుర్తుచేసిన కేటీఆర్, రాబోయే రోజుల్లో తాము మళ్లీ అధికారంలోకి వస్తే నగరంలోని ప్రతి ఇంటికి 24 గంటల పాటు నిరంతర తాగునీటిని సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ ద్వారా ఇప్పటికే ఇంటింటికీ పైప్‌లైన్ కనెక్షన్లు ఇచ్చామని, 24 గంటల నీటి సరఫరా బాధ్యతను స్వయంగా తానే భుజాన వేసుకుంటానని ప్రకటించడం ద్వారా నగర ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి కరెంటు కోతలు, నీటి కొరతలను ప్రజలకు గుర్తు చేస్తూ నాటికీ, నేటికీ ఉన్న వ్యత్యాసాన్ని విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి
గడిచిన రెండున్నర ఏళ్ల కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్ నగరానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఖర్చు చేయలేదని కేటీఆర్ దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అసమర్థ ప్రభుత్వంగా అభివర్ణిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ఫ్లైఓవర్లు, టిమ్స్ ఆసుపత్రుల రిబ్బన్లు కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తున్నారని ఆరోపించారు. గడిచిన రెండున్నర సంవత్సరాలలో హైదరాబాద్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదన్నారు. ఒకవేళ ఒక్క ఇల్లయినా నిర్మించినట్లు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తానని కేటీఆర్ సవాల్ విసిరారు. మహిళలకు 2500 రూపాయల సాయం, పెన్షన్ల పెంపు వంటి అడ్డగోలు హామీలతో కాంగ్రెస్ ప్రతి వర్గాన్ని మోసం చేసిందని, అందుకే అవగాహన ఉన్న హైదరాబాద్ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు.
హైదరాబాద్ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి రియల్ ఎస్టేట్ రంగం కాంగ్రెస్ పాలన వల్ల పూర్తిగా దెబ్బతిందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు, సెంట్రింగ్ కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రాగానే ఈ కార్మికుల కోసం ప్రత్యేక బీమా సౌకర్యంతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రకటించడం ద్వారా నగరంలోని వలస, కార్మిక ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకునే వ్యూహాన్ని అమలు చేశారు. గత పదేళ్లలో అభివృద్ధిపైనే పూర్తి ఫోకస్ పెట్టామని, ఈసారి అధికారంలోకి వస్తే కష్టపడిన కార్యకర్తలకు, నేతలకు పూర్తి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







