అమెరికా రాజధానిలో ఘనంగా మహానాడు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రవాసాంధ్రులు
అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ ప్రాంతంలోని వర్జినియాలో మినీ మహానాడును ఘనంగా నిర్వహించారు. ముఖ్యంగా స్థానిక ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు ఇందులో ఉత్సాహంగా పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన, మా తెలుగు తల్లికి గీతాలాపనలతో కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి భానుప్రకాష్ మాగులూరి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు హాజరయ్యారు. అమెరికాలో ఎన్నారై టీడిపి విభాగాన్ని నడిపిస్తున్న జయరాం కోమటి సహకారంతో ఈ మహానాడును నిర్వాహకులు ఏర్పాటు చేశారు.
మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ. తెలుగు నేలపై చెరగని చిరునామా ఎన్టీఆర్. ఆయన ఏ నిర్ణయం తీసుకున్న అది ప్రజా హితం… సంచలనమే అన్నారు. మహిళలకు ఆస్తిలో హక్కునేకాదు… రాజ్యాధికారాన్నీ కట్టబెట్టారు. మే 28…కేవలం ఎన్టీఆర్ పుట్టిన రోజు మాత్రమే కాదు. తెలుగు జాతి ఆత్మగౌరవం మేల్కొన్న రోజు. ఎన్టీఆర్, చంద్రబాబు తర్వాత మూడో తరం నేత నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా భాద్యతలు స్వీకరించడంతో ఈసారి మహానాడు మరింత ప్రత్యేకతను సంతరించుకోనుందని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పొదుపు చర్యలను పాటిస్తూ… మహానాడును దేశానికే ఆదర్శవంతంగా టీడిపి అధిష్టానం నిర్వహించనుందని మన్నవ సుబ్బారావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి

భాను మాగులూరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని విశ్వసించిన ఎన్టీఆర్ పాలనలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొని వచ్చి తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసారు. చంద్రబాబు దూరదృష్టితో రాష్ట్రాన్ని అభివృద్ధిదిశగా విస్తరింప చేసారు. లోకేష్ కొత్త తరం నాయకత్వంతో మరింత ఆధునిక దిశగా అడుగులు వేస్తున్నారని భాను పేర్కొన్నారు. యశస్వి బొద్దులూరి మాట్లాడుతూ తెలుగునేల ఉన్నంతవరకూ ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. కళా రంగాన్ని, సేవారంగానికి పునాదిగా మలచుకొని తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారన్నారు. సాయి బొల్లినేని మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగుదేశం కార్యకర్తల గుండెల్లో గూడుకట్టుకుందని, ఈనాటి లక్షలాది తెలుగు వారి ఉన్నతికి, సాంకేతిక ప్రగతికి చంద్రబాబు దార్శనికతే కారణమన్నారు. చంద్రమోహన్ బేవర, రామ్ ప్రసాద్ మైనేని మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగుజాతికి ఆరాధ్య దైవంగా ఎప్పటికీ పేదల, మహిళల గుండెల్లో మిగిలిపోతారన్నారు. చివరన జయరాం కోమటి తదితరులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ మహానాడులో పలు తీర్మానాలు చేశారు. ఎపిలో ప్రవాసాంధ్రుల ఆస్తుల పరిరక్షణకొరకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, ఆంధ్ర ప్రదేశ్ లో యువతకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు ఎన్నారై సేవలను వినియోగించుకోవాలని, అలాగే వివిధ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎన్నారైలు పంపించే నిధులకు రాష్ట్ర ప్రభుత్వం మాచింగ్ గ్రాంట్ కింద గతంలో జన్మభూమి పేరిట నిధులు సమకూర్చేవారు. తిరిగి దాన్ని పునరుద్దరించవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కోరుతూ తీర్మానాలు చేశారు.

కార్యక్రమంలో మన్నే సత్యనారాయణ, జానకిరామ్ భోగినేని, రమేష్ అవిర్నేని, కిషోర్ కంచెర్ల, పయ్యావుల చక్రవర్తి, సుశాంత్ మన్నే, ఫణి యలమంచిలి, అరుణ్, రాజేష్ అడివి, మురళి బచ్చు, బాబు వేమన, సామినేని వెంకటేశ్వరరావు, సీతారామారావు, గోవర్ధన్, సుబ్బారావు, వెంకట రెడ్డి, చంద్రనాధ్ తదితరులు పాల్గొన్నారు.







