ఇరాన్ తో నిర్మాణాత్మక ఒప్పందం ట్రంప్..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి .. మాజీ అధ్యక్షుడు ఒబామా , ఆయన యంత్రాంగంపై మండిపడ్డారు. ఇరాన్ తో ఒబామా హయాంలో చేసుకున్న అణు ఒప్పందం.. అమెరికా చేసుకున్న అత్యంత చెత్త ఒప్పందాల్లో ఒకటన్నారు ట్రంప్. దానిని ఒబామా, ఆయన యంత్రాంగంలోని అనుభవం లేని అధికారులు ప్రతిపాదించి, అమలులోకి తెచ్చారని విమర్శించారు. ఇరాన్ (Iran) అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నాలకు అది వీలు కల్పించిందన్నారు.
తమ హయాంలో ప్రస్తుతం ఇరాన్తో జరుపుతున్న ఒప్పందం విషయంలో అలాంటి తప్పిదం జరగదని ట్రంప్ స్పష్టం చేశారు. చర్చలు క్రమబద్ధంగా, నిర్మాణాత్మకంగా సాగుతున్నాయన్నారు. ఒప్పందం విషయంలో తొందరపడొద్దని తమ ప్రతినిధులకు స్పష్టంగా చెప్పినట్లు ట్రంప్ వెల్లడించారు. ఒప్పందం కుదిరి, అంగీకరించి, ఇరుపక్షాలు సంతకాలు చేసే వరకు హర్మూజ్ దిగ్బంధనం పూర్తి స్థాయిలో అమల్లో ఉంటుందన్నారు.
పొరపాట్లకు తావులేకుండా.. సమయం తీసుకొని ఇరుపక్షాలు సరిగ్గా ఒప్పందం చేసుకోవాల్సి ఉందని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్తో తమ బంధం ప్రొఫెషనల్గా, మరింత ఉత్పాదకంగా మారుతోందన్నారు. అయినప్పటికీ.. అణ్వాయుధాన్ని అభివృద్ధి చేసుకోలేరని లేదా సమకూర్చుకోలేరనే విషయాన్ని వాళ్లు (ఇరాన్) అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటివరకు తమకు మద్దతు తెలిపిన, సహకారం అందించిన పశ్చిమాసియా దేశాలకు ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నట్లు ట్రూత్ సోషల్ వేదికగా ట్రంప్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి







