ఫోన్ల ధరలు తగ్గుతాయనే ఆశలో ఉన్నారా? అయితే ఈ జన్మలో మీరు ఫోన్ కొననట్టే..
కొత్త స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రాగానే కొనకుండా, పండుగ సీజన్లలో వచ్చే భారీ డిస్కౌంట్లు లేదా ఆఫర్ల కోసం వేచి చూసే వినియోగదారుల అంచనాలు ఇకపై తలకిందులు కానున్నాయి. గతంలో ఒక మోడల్ లాంచ్ అయిన ఏడాదికి దానిపై వేల రూపాయల మేర ధరలు తగ్గేవి. కానీ ప్రస్తుత గ్లోబల్ మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో ఆ రోజులు ముగిసిపోయాయని పారిశ్రామిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. మొబైల్ ఫోన్ల తయారీ వ్యయం విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
ఏఐ చిప్స్ డిమాండ్ తో మారిన సమీకరణాలు
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతకు ఆదరణ పెరగడంతో దానికి సంబంధించిన చిప్స్, ఇతర మౌలిక వసతుల తయారీ కంపెనీలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఐటీ రంగానికి చెందిన పెద్ద పెద్ద డేటా సెంటర్లు, ఏఐ సర్వర్ల కోసం ఈ విడిభాగాలు భారీగా తరలిపోతుండటంతో ఎలక్ట్రానిక్స్ సెమీకండక్టర్ల ధరలు ఆకాశాన్నంటాయి. ఉదాహరణకు గతంలో 30,000 రూపాయల విలువైన ఒక మొబైల్లో మెమరీ చిప్స్ వాటా 15,000 రూపాయల వరకు ఉండేది. ఇప్పుడు ఆ చిప్స్ తయారీ ఖర్చే రెట్టింపు కావడంతో కంపెనీలు బడ్జెట్ ఫోన్ల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రీబ్రాండింగ్ వ్యూహంతో మొబైల్ కంపెనీలు
విడిభాగాల కొరతను, పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని అధిగమించడానికి మొబైల్ తయారీ సంస్థలు సరికొత్త మార్కెట్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. అందులో భాగంగా పాత మోడల్ ఫోన్ల లోపల పెద్దగా మార్పులు చేయకుండా కేవలం పేర్లు మార్చి (రీబ్రాండింగ్) కొత్తగా ఆవిష్కరిస్తున్నాయి. పాత తరం ఫోన్లలోని ప్రాసెసర్లు, కెమెరా మాడ్యూళ్లు, డిజైన్లనే వాడుతూ ధరను మాత్రం పెంచి మార్కెట్లోకి వదులుతున్నాయి. మరికొన్ని బడ్జెట్ ఫోన్లలో 5G సపోర్ట్ ఫీచర్ను తొలగించి మళ్లీ 4G వేరియంట్లను ప్రవేశపెడుతున్నాయి. అలాగే కెమెరా క్వాలిటీని తగ్గించడం, స్టోరేజ్ ఆప్షన్లను పరిమితం చేయడం లాంటి మార్పులు చేస్తున్నాయి.
పెరిగిన ధరలు
ఉత్పత్తి ఖర్చులు భారీగా పెరగడం వల్ల పాత మోడళ్లను తక్కువ ధరకే విక్రయిస్తే కంపెనీలకు ఎలాంటి లాభాలు మిగలడం లేదు. ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకు మొబైల్ కంపెనీలు కేవలం గడచిన రెండు నెలల కాలంలోనే ఏకంగా 130 కి పైగా స్మార్ట్ఫోన్ మోడళ్ల ధరలను పెంచేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్కువ రోజులు వేచి చూస్తే మొబైల్స్ చౌకగా దొరుకుతాయనే పాత అంచనాలు ఇకపై నిజం కాకపోవచ్చు. కాబట్టి కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాల్సిన అత్యవసర పరిస్థితి ఉంటే, ఆఫర్ల కోసం ఆలస్యం చేయకుండా అందుబాటులో ఉన్న ధరలోనే సొంతం చేసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.







