ఎబోలా వైరస్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హై అలర్ట్..!
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా(Ebola) వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రపంచవ్యాప్తంగా ఎబోలా కేసులు పెరుగుతుండటంతో, రాష్ట్రంలోకి ఈ మహమ్మారి ప్రవేశించకుండా ముందస్తు రక్షణ చర్యలు చేపట్టాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్(Satyakumar Yadav) అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ప్రత్యేక ఆదేశాలు జారీ చేస్తూ వ్యవస్థను సిద్ధం చేశారు.
ముఖ్యంగా ఎబోలా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న కాంగో, ఉగాండా వంటి ఆఫ్రికా దేశాల నుండి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రయాణికులపై ప్రత్యేక నిఘా ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రధాన అంతర్జాతీయ, దేశీయ విమానాశ్రయాలైన విశాఖపట్నం, తిరుపతి(Tirumala), విజయవాడ (గన్నవరం) ఎయిర్‌పోర్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆయా విమానాశ్రయాల్లో ప్రత్యేక వైద్య బృందాలను రంగంలోకి దించి, అనుమానిత దేశాల నుండి వచ్చే ప్రయాణికులకు అక్కడికక్కడే స్క్రీనింగ్ మరియు వైద్య పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఒకవేళ ఎవరికైనా ఎబోలా లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే, వారిని వెంటనే ఐసోలేషన్‌కు తరలించి చికిత్స అందించేందుకు ప్రత్యేక వార్డులను సిద్ధం చేయాలని ఆదేశించారు. విమానాశ్రయాలతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల వైద్య యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అలర్ట్‌గా ఉండాలని మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. విదేశాల నుండి నేరుగా జిల్లాల్లోని తమ గ్రామాలకు లేదా పట్టణాలకు వచ్చే వారి సమాచారాన్ని సేకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని నిఘా విభాగాలకు సూచించారు. ప్రజలు కూడా ఎబోలా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అయితే విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అలాగే ప్రభుత్వ నిబంధనలను పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.







