మే 30న న్యూజెర్సీలో ‘అన్నమయ్యకు ఆరాధన’ ఉత్సవం
అమెరికాలోని ప్రవాస తెలుగువారి పురాతన సాంస్కృతిక సంస్థ ‘తెలుగు కళా సమితి’ (TFAS), సాయి దత్త పీఠం న్యూజెర్సీ సంయుక్త ఆధ్వర్యంలో పదకవిత పితామహ తాళ్లపాక అన్నమాచార్యులను స్మరించుకుంటూ “అన్నమయ్యకు ఆరాధన” (Aradhana to Annamayya) గ్రాండ్ ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అన్నమాచార్యుల వారి 618వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ వేడుక 2026 మే 30వ తేదీ శనివారం న్యూజెర్సీలో భక్తిశ్రద్ధలతో జరగనుంది.
ఉత్సవ ప్రధాన వివరాలు:
తేదీ: మే 30, 2026 (శనివారం)
సమయం: సాయంత్రం 4:00 గంటల నుండి ప్రారంభం
వేదిక: సాయి దత్త పీఠం (Sai Datta Peetham), ఓక్ ట్రీ రోడ్, ఎడిసన్, న్యూజెర్సీ (NJ 08820), అమెరికా.
ఉత్సవానికి విచ్చేసే భక్తులు, సందర్శకులందరికీ రాత్రి భోజన వసతి కల్పిస్తారు.
అన్నమయ్య సంకీర్తనల విశిష్టత..
అన్నమాచార్యుల వారు తమ జీవితకాలంలో శ్రీవేంకటేశ్వర స్వామిని కీర్తిస్తూ సుమారు 32,000 సంకీర్తనలను రచించగా, వాటిలో ప్రస్తుతం 14,904 సంకీర్తనలు లభ్యమవుతున్నాయి. కర్ణాటక సంగీత నిర్మాణ అభివృద్ధిపై అన్నమయ్య రచనలు ఎంతో ప్రభావాన్ని చూపాయి. కేవలం భక్తి ప్రపత్తులకే పరిమితం కాకుండా, నాటి సమాజంలోని అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలపై కూడా ఆయన తన కీర్తనల ద్వారా గళమెత్తారు.
ఉత్సవంలోని ప్రధాన సాంస్కృతిక కార్యక్రమాలు:
అన్నమయ్య చరిత్ర (కూచిపూడి నృత్య రూపకం): సిద్ధేంద్ర కూచిపూడి ఆర్ట్ అకాడమీ విద్యార్థులతో అన్నమయ్య జీవిత చరిత్రపై అద్భుతమైన నృత్య రూపకం. (గురువు: స్వాతి అట్లూరి). ఈ ప్రదర్శన ఎడిసన్, బ్రిడ్జ్వాటర్, ప్లైన్స్ బోరో, ప్రిన్స్టన్, మార్ల్బోరో మన్రో పరిసర ప్రాంతాల విద్యార్థులతో రూపుదిద్దుకుంది.
అన్నమయ్య కీర్తనలు (భరతనాట్య ప్రదర్శన): ఆచార్య డాన్స్ స్కూల్ (ఎడిసన్) విద్యార్థులతో అన్నమయ్య కీర్తనలపై ప్రత్యేక భరతనాట్య ప్రదర్శన ఉంటుంది. (గురువు: సౌజన్య బండారు).
అన్నమయ్య సంగీత విభావరి: మూడు ప్రముఖ సంగీత అకాడమీల విద్యార్థులు కలిసి ఈ మధురమైన గానలహరిని అందించనున్నారు:
మహతి మ్యూజిక్ అకాడమీ, ఎడిసన్ (గురువు: రేఖ బ్రహ్మసముద్రం)
కృష్ణవేణి స్కూల్ ఆఫ్ కర్నాటిక్ మ్యూజిక్, ఎడిసన్ (గురువు: విజయలలిత వేమూరి)
స్వర రాగ సుధా కళా అకాడమీ, బ్రాంచ్బర్గ్ (గురువు: ఉష అకెళ్ల)
ప్రత్యేక కార్యక్రమం (తెలుగులో రామాయణాలు – విశిష్టత): వాల్మీకి, మొల్ల, రంగనాథ విశ్వనాథ సత్యనారాయణ రచించిన రామాయణ కావ్యాల నుండి ప్రముఖులతో పద్య పఠనం.
ఈ ఆధ్యాత్మిక సంబరాలను సాయి దత్త పీఠం – శివ విష్ణు టెంపుల్ వ్యవస్థాపక చైర్మన్ బ్రహ్మశ్రీ రఘు శర్మ శంకరమంచి, ఛారిటీ ప్రోగ్రామ్స్ ఇన్ఛార్జ్ సుభద్ర పతిబండ్ల టీఫాస్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (2024 – 2026) ప్రతినిధులు మధు అన్న, వెంకట సత్య తాత, వాణి కునిశెట్టి, లోకేందర్ గిరకల, శేషగిరి రావు కంభంమెట్టు, లతాదేవి మడిశెట్టి, అరుంధతి శాకెల్లి, వరలక్ష్మి రాధాకృష్ణ ప్రసాద్ వూటుకూరులు పర్యవేక్షిస్తున్నారు.







