సూర్యకుమార్ యాదవ్‌పై బీసీసీఐ సీరియస్..?
భారత టీ20 క్రికెట్ జట్టులో మరోసారి నాయకత్వ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Surya Kumar Yadav) సుదీర్ఘకాలం పాటు కెప్టెన్‌గా కొనసాగడంపై బీసీసీఐ (BCCI) లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఐపీఎల్లో ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో పాటు, అతని ప్రస్తుత బ్యాటింగ్ ఫామ్‌పై సెలెక్టర్లు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో కొత్త కెప్టెన్‌ను నియమించేందుకు బీసీసీఐ కసరత్తులు చేస్తోందని పీటీఐ (PTI) నివేదిక పేర్కొంది.
గత ఐపీఎల్ సీజన్లలో భారీ స్కోర్లతో విధ్వంసం సృష్టించిన సూర్యకుమార్, తాజా ఎడిషన్‌లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా పేస్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో అతని టెక్నికల్ లోపాలు మరియు పేలవ ప్రదర్శన సెలెక్టర్లను ఆలోచనలో పడేసింది. ఒక బ్యాటర్‌గా మాత్రమే అతన్ని జట్టులో కొనసాగించడంపై జాతీయ సెలెక్షన్ కమిటీ సభ్యులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నిర్ణయమే అత్యంత కీలకం కానుందని బీసీసీఐ సీనియర్ వర్గాలు వెల్లడించాయి.
అంతేకాకుండా, 2028 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే యువ జట్టును సిద్ధం చేయాలనే యోచనలో బోర్డు ఉండటంతో సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్ ప్రణాళికల్లో ఫిట్ అవ్వడం కష్టంగా మారినట్లు తెలుస్తోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీపై అనిశ్చితి నెలకొన్న తరుణంలో తదుపరి వారసుడిగా శ్రేయస్ అయ్యర్(Shreyas Iyer) మరియు శుభ్‌మన్ గిల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్‌కు అద్భుతమైన లీడర్షిప్ స్కిల్స్ ఉన్నప్పటికీ, గతంలో కేకేఆర్ ఐపీఎల్ విజయం క్రెడిట్ మొత్తం గంభీర్ ఖాతాలోకి వెళ్లడంపై తలెత్తిన కొన్ని అభిప్రాయాల వల్ల గంభీర్-శ్రేయస్ కాంబినేషన్‌పై కొన్ని సందేహాలు ఉన్నాయి. మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఐపీఎల్లో(IPL) మంచి ప్రదర్శన చేసిన శుభ్‌మన్ గిల్(Shubhman Gill) రేసులో బలంగా దూసుకొస్తున్నాడు. వీరితో పాటు భవిష్యత్ అవసరాల కోసం తిలక్ వర్మ(Tilak Varma), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వంటి ఆటగాళ్లను కూడా లీడర్షిప్ కోసం బీసీసీఐ పరిశీలిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారికంగా స్పష్టత రానుంది.







