అర్ధంతరంగా ముగిసిన కెరీర్, 2019 వరల్డ్ కప్ చేదు జ్ఞాపకం..!
భారత ఆల్ రౌండర్, ఒకప్పుడు “3D క్రికెటర్” గా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్‌కు గురైన విజయ్ శంకర్ (Vijay Shankar) అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. “నా కెరీర్లో ఎన్నడూ ఊహించని స్థాయిలో ద్వేషాన్ని, నెగిటివిటీని ఎదుర్కొన్నాను” అంటూ ఆవేదనతో వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం 35 ఏళ్ల వయసున్న విజయ్ శంకర్ రిటైర్మెంట్ నిర్ణయంతో.. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో భారత క్రికెట్లో చోటుచేసుకున్న అత్యంత వివాదాస్పదమైన మరియు నాటకీయమైన 75 రోజుల పరిణామాలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
2019 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాలో నంబర్ 4 స్థానం కోసం అంబటి రాయుడును దాదాపు ఖరారు చేశారు. అప్పటి కెప్టెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) కూడా రాయుడే బెస్ట్ ఛాయిస్ అని ప్రకటించారు. కానీ, ఏప్రిల్ 16న అప్పటి సెలక్షన్ కమిటీ ఛైర్మన్ ఎంఎస్కే ప్రసాద్.. రాయుడును పక్కనబెట్టి విజయ్ శంకర్‌ను వరల్డ్ కప్ జట్టుకు ఎంపిక చేసి అందరికీ షాక్ ఇచ్చారు. విజయ్ శంకర్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ చేయగల “త్రీ-డైమెన్షనల్ (3D)” ప్లేయర్ అని ఎంఎస్కే ప్రసాద్ సమర్థించుకోగా.. దీనిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన రాయుడు, తాను ప్రపంచకప్‌ను చూడటానికి “3D గ్లాసెస్” ఆర్డర్ ఇచ్చానంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
ప్రపంచకప్‌లో(World Cup) భాగంగా మాంచెస్టర్‌లో పాకిస్తాన్‌తో జరిగిన హై-వోల్టేజ్ మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ మధ్యలోనే గాయపడటంతో కోహ్లీ బంతిని విజయ్ శంకర్‌కు ఇచ్చాడు. వన్డే ప్రపంచకప్‌లో తాను వేసిన అత్యంత మొదటి బంతికే పాక్ బ్యాటర్ ఇమామ్-ఉల్-హక్‌ను అవుట్ చేసి విజయ్ శంకర్ సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. అయితే, ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ మ్యాచ్‌లలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అనంతరం ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌కు ముందు విజయ్ శంకర్‌కు హఠాత్తుగా “కాలి వేలి గాయం” అయిందంటూ జట్టు యాజమాన్యం ఆయనను టోర్నమెంట్ నుండి తప్పించి రిషబ్ పంత్‌ను జట్టులోకి తెచ్చింది.
అప్పట్లో ఈ గాయం తీవ్రమైన అనుమానాలకు తావిచ్చింది. ఎందుకంటే గాయం అంతకుముందే అయిందని ప్రచారం జరిగినా ఆయన ఆ తర్వాత కూడా మ్యాచ్‌లు ఆడారు. టోర్నీ మధ్యలోనే ఆయనను ఇండియాకు పంపేయడం, ఆ తర్వాత ఆయనకు మళ్లీ ఎన్నడూ భారత జట్టులో అవకాశం దక్కకపోవడం గమనార్హం. బీసీసీఐ సెలక్షన్ కమిటీ తీసుకున్న ఒకే ఒక్క తొందరపాటు నిర్ణయం వల్ల ఇద్దరు ప్రతిభావంతులైన ఆటగాళ్ల అంతర్జాతీయ కెరీర్ అర్ధాంతరంగా ముగిసిపోయింది.
అటు సెలక్టర్లపై తిరుగుబాటు చేసిన అంబటి రాయుడు ఆగ్రహంతో రిటైర్మెంట్ ప్రకటించగా.. ఇటు వరల్డ్ కప్ ఆడిన రెండు నెలలకే విజయ్ శంకర్ మళ్లీ దేశవాళీ క్రికెట్ గ్రౌండ్‌కు పరిమితమవ్వాల్సి వచ్చింది. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా లాంటి టాప్ ఆల్ రౌండర్లు ఉన్నప్పటికీ, విజయ్ శంకర్‌ను జట్టులోకి తెచ్చి బీసీసీఐ అనవసర వివాదాలు కొని తెచ్చుకుందని విమర్శకులు భావిస్తారు. ఏదేమైనా, ఆ 75 రోజుల నాటకీయ పరిణామాలు భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోయాయి.







