రెండు రోజుల్లో వారి సమస్యలను పరిష్కరించాలి.. లేకపోతే : కవిత హెచ్చరిక
సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సర్కార్ విఫలమైందని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) విమర్శించారు. ఇందిరాపార్క్ వద్ద జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ గుత్తేదారుల అసోసియేషన్ మహాధర్నాకు కవిత మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడారు. సెంట్రింగ్ కార్మికులకు (Centering workers) తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. రెండు రోజుల్లో సెంట్రింగ్ కార్మికుల నాయకులతో రేవంత్ రెడ్డి చర్చించాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలు పరిష్కరించకపోతే రెండు రోజుల తర్వాత తానే స్వయంగా ధర్నాలో కూర్చుంటానని స్పష్టం చేశారు. సెంట్రింగ్ కార్మికుల డిమాండ్లు గొంతెమ్మ కోరికలు కావని, న్యాయమైనవేనని చెప్పుకొచ్చారు. తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తే సెంట్రింగ్ కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా విద్య (Education), వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.







