బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదు .. ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు : మంత్రి పొంగులేటి
మాజీమంత్రి హరీశ్ రావు (Harish Rao) పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అమెరికా (America) నుంచి ఫ్యూచర్ సిటీ (Future City)ని ఆపేస్తామంటూ హరీశ్ రావు ఎలా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లో హరీశ్ రావు ఫ్యూచర్ ఏంటో ఆయనకే తెలియదు అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఫ్యూచర్ సిటీ భూములపై అమెరికాలో ఎవరికైనా ఒప్పందాలు చేసుకున్నారా? అంటూ నిలదీశారు. కేసీఆర్ (KCR) హయాంలోని పదేళ్లలో ఒక్క మెట్రోస్టేషన్ కూడా ఎందుకు పూర్తిచేయలేదని ప్రశ్నల వర్షం కురిపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా కొత్త నగరాన్ని నిర్మిస్తోందని వ్యాఖ్యానించారు. కేసీఆర్ కుటుంబం ఫాంహౌస్ లు కట్టుకుందని, కానీ తాము రాష్ట్ర భవిష్యత్తు కోసం ఫ్యూచర్ సిటీ కడుతున్నామని ఉద్ఘాటించారు. మూసీప్రక్షాళన, లగచర్ల ఇండస్ట్రీస్ కు బీఆర్ఎస్ నేతలు అడ్డుపడ్డారని ఆగ్రహించారు. యువతకు ఉద్యోగాలు కల్పించే ప్రయత్నాలను కుట్రలతో అడ్డుకున్నారని ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా తాము ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హరీశ్ రావు రాజకీయ భవిష్యత్తు ఖతం చేయాలని బీఆర్ఎస్ నేతలే చూస్తున్నారని సెటైర్లు గుప్పించారు. బీఆర్ఎస్ కు ఫ్యూచర్ లేదు, ఫ్యూచర్ సిటీకి తిరుగులేదు అంటూ మంత్రి వ్యాఖ్యానించారు.







