జీనోమ్ వ్యాలీలోని లైఫ్ సైన్సెస్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం
Genome Valley Fire: దేశీయంగా ఎంతో గుర్తింపు పొందిన బయోటెక్ , రీసెర్చ్ హబ్ అయిన హైదరాబాద్లోని ‘జీనోమ్ వ్యాలీ’లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గ్లోబల్ ఫండ్ యాక్టిస్, బ్రిటిష్ ఇంటర్నేషనల్ ఇన్వెస్ట్మెంట్ (బీఐఐ)లకు చెందిన ప్రముఖ లైఫ్ సైన్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్ఫామ్ ‘ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్’ (Rx Propellant) ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక లైఫ్ సైన్సెస్ కేంద్రంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
భారీగా నష్టం..
కేంద్రంలో చోటుచేసుకున్న భద్రతా లోపాల వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదం కారణంగా భవన సముదాయంలో సేవలందిస్తున్న గ్లోబల్ కాంట్రాక్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CRO) ప్రాంగణం తీవ్రంగా దెబ్బతింది. భవన నిర్మాణంతో పాటు లోపల ఉన్న విలువైన మౌలిక సదుపాయాలకు భారీగా నష్టం వాటిల్లింది.
పరిశోధనలకు తీవ్ర అంతరాయం..
ప్రమాదానికి గురైన ల్యాబ్లు, రీసెర్చ్ విభాగాలు సరికొత్త ఔషధాల ఆవిష్కరణలు (Drug Discovery), క్లినికల్ ట్రయల్స్ నిర్వహణలో అత్యంత కీలకమైనవి. ఈ ప్రమాదం కారణంగా ప్రస్తుతం అక్కడ కొనసాగుతున్న పలు పరిశోధన ప్రాజెక్టులు నిలిచిపోయాయి. దీంతో నిర్దేశిత కాలపరిమితిలోగా క్లయింట్లకు అందించాల్సిన ప్రాజెక్టుల గడువు మారే అవకాశం ఉండటంతో పాటు, పరిశోధన రంగానికి పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది.







