ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తాం.. హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు!
అమెరికా పర్యటనలో ఉన్న BRS కీలక నేత హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భవిష్యత్తులో తెలంగాణలో మళ్లీ BRS ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ‘ఫ్యూచర్ సిటీ’ని రద్దు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఈ డ్రామాలకు తెరలేపిందని ఆయన అమెరికా వేదికగా ఆరోపించారు.
ఇవి కూడా చదవండి
గత BRS ప్రభుత్వం ప్రతిపాదించిన ఫార్మా సిటీ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ స్పష్టమైన అనుమతులు ఇచ్చిందని హరీష్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పైకి ఫార్మా సిటీని రద్దు చేశామని చెబుతున్నప్పటికీ, లోపల జరుగుతున్నది వేరని ఆయన విమర్శించారు. ఇటీవల హైకోర్టులో జరిగిన ఒక కేసు విచారణను ప్రస్తావిస్తూ మేము ఫార్మా సిటీని కొనసాగిస్తున్నాం అని రేవంత్ ప్రభుత్వమే స్వయంగా కోర్టుకు అఫిడవిట్ సమర్పించిందని ఆయన వెల్లడించారు. ఒకవైపు కోర్టుకు ఫార్మా సిటీ ఉంటుందని చెబుతూనే, మరోవైపు ప్రజల ముందు ఫ్యూచర్ సిటీ అంటూ జిమ్మిక్కులు చేయడం కాంగ్రెస్ ద్వంద్వ విధానానికి అద్దం పడుతోందని ధ్వజమెత్తారు.
నిబంధనల ప్రకారం ఫార్మా సిటీ వస్తే దానికి అనుబంధంగా కనీస సౌకర్యాలు, విద్య, వైద్యం, హౌసింగ్ వంటివి ఏర్పాటు చేయాల్సి ఉంటుందని హరీష్ రావు వివరించారు. లీగల్ గైడ్‌లైన్స్ ప్రకారం 75 శాతం ఫార్మా సిటీ ఉండి, మిగిలిన 25 శాతం ఇతర అవసరాలకు కేటాయించాలి. కానీ ప్రస్తుత ప్రభుత్వం దీనిని పూర్తిగా తలకిందులు చేసిందని ఆయన ఆరోపించారు. కేవలం 25 శాతం మాత్రమే ఫార్మాకు పరిమితం చేసి, మిగిలిన 75 శాతాన్ని ఇతర వ్యాపారాలకు, రియల్ ఎస్టేట్ దందాలకు వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. చట్టప్రకారం ఈ రకమైన ల్యాండ్ యూజ్ మార్పిడి లేదా డీవియేషన్ అస్సలు చెల్లదని ఆయన హెచ్చరించారు. డీవియేషన్ ఉంటే రైతుల భూములు వెనక్కి ఇవ్వాలని పార్లమెంట్ చట్టం చెబుతోందని హరీశ్ రావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ల్యాండ్ పూలింగ్ జిమ్మిక్కులు చట్టం ముందు నిలబడవని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ నుంచి ఒక్క ఫార్మా కంపెనీ కూడా బయటకు వెళ్లకూడదనే ఉద్దేశంతో, లక్షలాది మంది స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడమే ధ్యేయంగా తాము ఫార్మా సిటీని ప్రారంభించామని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయి అభివృద్ధి చెందితే ఎక్కడ BRS పార్టీకి మంచి పేరు వస్తుందో అనే ఈర్ష్య, కుట్రలతోనే రేవంత్ సర్కార్ దీనిని పక్కనబెట్టే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. భూములను రీ-అలైన్మెంట్ పేరుతో పంచిపెట్టి, బ్యాక్ ఎండ్ ద్వారా భారీగా లబ్ధి పొందాలనే ప్లాన్ ఇందులో దాగి ఉందని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే రెండున్నర ఏళ్ల కాలం గడిచిపోయిందని, మిగిలిన కాలంలో చివరి ఏడాది ఎలాగూ ఎన్నికల మూడ్‌లోనే గడుస్తుందని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ రెండున్నరేళ్లలో రేవంత్ సర్కార్ సాధించింది ఏమీ లేదని, కేవలం కాలయాపన చేస్తోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని అక్రమాలకు తెరలేపినా క్షేత్రస్థాయిలో అవి సాగవని, చట్టపరంగా నిలబడబోవని తేల్చిచెప్పారు. తాము అధికారంలోకి రాగానే వంద శాతం ఫ్యూచర్ సిటీని రద్దు చేసి, యథావిధిగా ఉన్నది ఉన్నట్టుగా అక్కడ ‘ఫార్మా సిటీ’ని రీస్టోర్ చేస్తామని హరీష్ రావు హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి







