సొంత కారు కలకు బ్రేకులు! జూన్ నుంచి రూ.30 వేలు పెరగనున్న ధరలు!
భారతదేశపు అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, సామాన్యుల డ్రీమ్ కార్ బ్రాండ్ ‘మారుతీ సుజుకి‘ (Maruti Suzuki) కస్టమర్లకు ఊహించని షాక్ ఇచ్చింది. సొంత కారు కొనుక్కోవాలని ప్లాన్ చేసుకుంటున్న మధ్యతరగతి వర్గాల ఆశలపై నీళ్లు చల్లింది. ఈ ఏడాది జూన్ నెల నుంచి తమ పోర్ట్‌ఫోలియోలోని అన్ని కార్ల మోడళ్లపై ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఒకపక్క ఎండల తీవ్రతతో అల్లాడుతున్న సామాన్యుడికి, మారుతీ తీసుకున్న ఈ నిర్ణయం నిజంగా ఆర్థికంగా చెమటలు పట్టించేదే అని చెప్పాలి.
ఎంత పెరుగుతున్నాయంటే..?
మారుతీ (Maruti Suzuki) కారు అంటేనే బడ్జెట్ ఫ్రెండ్లీ, మైలేజ్ కింగ్ అనే పేరుంది. కానీ ఇకపై ఆ బడ్జెట్ కాస్త పైకి చేరనుంది. కంపెనీ తీసుకున్న తాజా నిర్ణయంతో మోడల్, వేరియంట్‌ను బట్టి గరిష్టంగా రూ.30,000 వరకు ధరల భారం కొనుగోలుదారుల నెత్తిన పడనుంది. ఈ మేరకు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమర్పించిన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ఎంట్రీ లెవల్ హాచ్బ్యాక్ కార్ల నుంచి ప్రీమియం ఎస్‌యూవీల (SUVs) వరకు దాదాపు అన్ని మోడళ్లపై ఈ పెంపు ప్రభావం ఉంటుందని ఆటోమొబైల్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ధరల పెంపునకు కారణం ఏంటి?
కారు ధరలు పెంచడానికి గల ప్రధాన కారణాలను కూడా మారుతీ సుజుకి (Maruti Suzuki) సంస్థ వివరించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, విపరీతంగా పెరిగిపోయిన ముడి పదార్థాల (Raw Materials) ధరలు, రోజురోజుకూ పెరుగుతున్న తయారీ వ్యయమే ఈ నిర్ణయానికి దారితీసిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. గత కొన్ని నెలలుగా పెరుగుతున్న ఈ అదనపు ఖర్చుల భారాన్ని కస్టమర్లపై మోపకుండా ఉండేందుకు సంస్థ అంతర్గతంగా అనేక కసరత్తులు చేసిందని, అనేక ఖర్చు తగ్గింపు చర్యలు చేపట్టిందని ఫైలింగ్‌లో పేర్కొంది. కానీ ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఆ ఆర్థిక భారాన్ని పూర్తిగా తమ భుజాలపై వేసుకోవడం సాధ్యం కావడం లేదని, అందుకే అందులో కొంత భాగాన్ని తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలుదారులకు బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. అయితే కస్టమర్లపై ఈ భారం సాధ్యమైనంత తక్కువగా ఉండేలా అత్యంత జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంస్థ (Maruti Suzuki) వివరణ ఇచ్చుకుంది.
ఇప్పుడు మళ్లీ భారం!
ఒకసారి గతాన్ని పరిశీలిస్తే, మారుతీ సుజుకి (Maruti Suzuki) కస్టమర్లకు ఇది నిజంగా పెద్ద కుదుపే అని చెప్పాలి. ఎందుకంటే గతేడాది ‘జీఎస్టీ 2.0’ నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత, సామాన్యులకు భారీ ఊరటనిస్తూ కంపెనీ తన ఎంట్రీ లెవల్ కార్ల ధరలను గణనీయంగా తగ్గించింది. ఆల్టో కె10 (Alto K10), సెలెరియో (Celerio), వ్యాగన్ ఆర్ (Wagon R) వంటి అత్యధికంగా అమ్ముడయ్యే బడ్జెట్ మోడళ్ల ధరలు దిగిరావడంతో కస్టమర్లు సంబరపడ్డారు. కానీ ఆ సంతోషం ఎన్నాళ్లో నిలవలేదు. మళ్లీ ఇప్పుడు ముడిసరుకు, ద్రవ్యోల్బణం పేరుతో ధరల పెంపు వైపు అడుగులు వేయడం కొనుగోలుదారులను నిరాశకు గురిచేస్తోంది. దేశీయ ఆటోమొబైల్ రంగంలో సింహభాగం మార్కెట్ వాటా కలిగిన మారుతీ సుజుకి తీసుకున్న ఈ నిర్ణయం.. పరిశ్రమలో ఒక ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది. మారుతీ బాటలోనే హ్యుందాయ్, టాటా, మహీంద్రా వంటి మరిన్ని దిగ్గజ సంస్థలు కూడా ధరల పెంపునకు మొగ్గు చూపుతాయా అనే ఆందోళన మార్కెట్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి







