భారత్‌కు భారీ ఆర్థిక ముప్పు తప్పదా? ఐఎంఎఫ్ మాజీ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్చరిక!
పశ్చిమాసియాలో రగులుతున్న యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావడం లేదు. ఆ సెగలు నేరుగా భారతీయ సామాన్యుడి జేబును (Indian Economy) దహించివేసే ప్రమాదం పొంచి ఉందని ప్రముఖ ఆర్థికవేత్త గీతా గోపీనాథ్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, రాబోయే రోజుల్లో భారత ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఆర్థిక కుదుపునకు గురయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆమె జాతీయ మీడియాకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో విశ్లేషించారు.
చమురు ధరల సునామీ?
ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణం జూన్ నెల వరకు కొనసాగితే, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశమే హద్దుగా చెలరేగుతాయని ఆమె జోస్యం చెప్పారు. బ్యారెల్ ముడిచమురు ధర ఏకంగా 140 డాలర్ల స్థాయికి చేరుకోవచ్చని అంచనా వేశారు. ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలే ఈ భయాలకు ప్రధాన కారణం. ఒకవేళ ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినా, దెబ్బతిన్న సప్లై చైన్ వ్యవస్థలు తిరిగి గాడిన పడటానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సుదీర్ఘ సమయం పడుతుందన్నారు.
ఇవి కూడా చదవండి
సామాన్యుడిపై ద్రవ్యోల్బణ భారం
క్రూడాయిల్ ధరలు ఈ స్థాయిలో ఎగబాకితే ఆ ప్రభావం నేరుగా భారత్‌లోని (Indian Economy) ఇంధన ధరలపై పడుతుంది. ఇన్నాళ్లూ పెట్రోల్, డీజిల్ ధరలను పెంచకుండా నియంత్రిస్తున్న ప్రభుత్వాలకు ఇకపై ఆ భారాన్ని మోయడం సాధ్యం కాకపోవచ్చు. అనివార్యంగా కొంత భారాన్ని ప్రభుత్వం భరిస్తూనే, మిగిలిన భాగాన్ని ప్రజలపై, కార్పొరేట్ కంపెనీలపై మోపక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కేవలం పెట్రోల్ బంకులకే పరిమితం కాదు; ఎల్పీజీ (LPG), ఎల్ఎన్జీ (LNG), వ్యవసాయ రంగానికి అత్యవసరమైన ఎరువుల సరఫరాపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రవాణా ఖర్చులు పెరగడంతో నిత్యావసర వస్తువుల నుంచి తయారీ రంగ వ్యయాల వరకు అన్నీ తడిసి మోపెడవుతాయి. ఫలితంగా రాబోయే నెలల్లో దేశంలో ద్రవ్యోల్బణం దడ పుట్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
రూపాయి పతనంపై అపోహలు వద్దు
ఇదే సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ రూ.100 దాటుతుందంటూ వస్తున్న ఊహాగానాలను గీతా గోపీనాథ్ పూర్తిగా కొట్టిపారేశారు. రూపాయి కాస్త బలహీనపడటం (Indian Economy) అనేది దేశానికి ఒకరకంగా మేలు చేస్తుందని, ఇది అనవసర దిగుమతులను నియంత్రించడంలో సహాయపడుతుందని ఆమె విశ్లేషించారు. మార్కెట్లో మారకపు విలువ రోజువారీ హెచ్చుతగ్గుల గురించి ఆందోళన చెందడం కంటే.. దేశంలో ఉద్యోగాల కల్పన, ఆర్థిక వృద్ధిరేటు, ద్రవ్యోల్బణ నియంత్రణ వంటి కీలకమైన స్థూల ఆర్థిక అంశాలపై ప్రభుత్వాలు దృష్టి సారించడం అత్యంత ఆవశ్యకమని ఆమె సూచించారు.
భారత్‌కు ఉన్న రక్షణ కవచం ఇదే..
పరిస్థితి పైకి ఆందోళనకరంగా కనిపిస్తున్నప్పటికీ, ఈ కుదుపుల కారణంగా భారత్ పూర్తిస్థాయి ఆర్థిక (Indian Economy) సంక్షోభంలో కూరుకుపోయే అవకాశాలు చాలా తక్కువని ఆమె వివరించారు. అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా, భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని బలమైన పునాదులు అండగా ఉన్నాయని ఆమె వివరించారు. దేశంలో బలంగా ఉన్న అంతర్గత డిమాండ్ (Domestic Demand), మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం చేస్తున్న భారీ వ్యయాలు, మెరుగైన స్థాయిలో ఉన్న విదేశీ మారక నిల్వలు (Forex Reserves)… దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక రక్షణ కవచంలా నిలుస్తాయని గీతా గోపీనాథ్ ధీమా వ్యక్తం చేశారు. సంక్షోభం వచ్చినా, దానిని తట్టుకుని నిలబడే శక్తి భారత్‌కు ఉందని ఆమె తెలిపారు.
ఇవి కూడా చదవండి







