యుద్ధంపై ట్రంప్, నెతన్యాహు చెరోదారి..!
ఇరాన్ పై యుద్ధం పునరుద్ధరణ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ చెరోదారిలో పయనిస్తున్నాయా..? అంటే తాజా పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. అమెరికా ఇరాన్‌తో చర్చలకు మొగ్గు చూపుతుండగా ఇజ్రాయెల్ దాడుల పునరుద్ధరణ కోరుతోంది. అమెరికా విధానంపై ఇజ్రాయెల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. ఈ విషయమై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య ఫోన్లో వాగ్యుద్ధం జరిగినట్లు సమాచారం. ‘‘మీరు తప్పు చేస్తున్నారు’’ అని నెతన్యాహు ట్రంప్‌ను హెచ్చరించారని కూడా ఆ మీడియా సంస్థ కథనం.
యుద్ధాన్ని పునరుద్ధరించడానికి బదులు చర్చల వైపే తాను మొగ్గుతున్నట్టు ట్రంప్ ఈ సందర్భంగా నెతన్యాహుతో అన్నారు. ఇరాన్‌పై దాడులు తక్షణం పునరుద్ధరించడం ద్వారా ఆ దేశ సైనిక సామర్థ్యాన్ని నశింపజేసి మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని, ఆ విధంగా టెహ్రాన్‌లోని ప్రభుత్వాన్ని మరింత బలహీన పరచాలని నెతన్యాహు గట్టిగా వాదించినట్టు మీడియా సంస్థ తెలిపింది. ట్రంప్‌తో సంభాషణ నెతన్యాహును మరింత ఆందోళనకు గురిచేసిందని యాక్సియోస్ పేర్కొంది.
చర్చలకు ఒక అవకాశం ఇద్దామని, అవి విఫలమైతే తిరిగి దాడుల్ని పునరుద్ధరించడం మన చేతుల్లోని పనే అని ట్రంప్ అన్నట్టు మీడియా కథనం వివరించింది. చర్చల్లో మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్, ఖతార్‌లు యుద్ధానికి చరమగీతం పాడేందుకు ఉద్దేశించిన ఒక ఉమ్మడి లేఖను సిద్ధం చేశాయని ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానికి చెప్పారని ఆ సంస్థ వివరించింది. అయితే ఇజ్రాయెల్‌తో తమకు ఎలాంటి విభేదాలు లేవన్నట్టుగా ట్రంప్ ప్రవర్తిస్తున్నారు. తాను ఏం చెబితే నెతన్యాహు అది చేస్తారని ఆయన విలేకరులకు తెలిపారు.
ఇరాన్‌తో చర్చలు జరపడంపై నెతన్యాహుకు విశ్వాసం లేదని ఇజ్రాయెల్ వర్గాలు చెబుతున్నాయి. యుద్ధాన్ని తిరిగి ప్రారంభించాలన్న ఆకాంక్ష ఇజ్రాయెల్ ప్రభుత్వ ఉన్నత వర్గాల్లో బలంగా ఉందని సీఎన్ఎన్ వెల్లడించింది.
ఇవి కూడా చదవండి







