టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేసులో ఉత్తమ్ పద్మావతి!?
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చూపిస్తున్న శ్రద్ధ, సంస్థాగత బలోపేతంపై చూపించలేదనే విమర్శలు ఉన్నాయి. టీపీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించి దాదాపు ఏడాదిన్నర గడిచింది. అయినా ఇప్పటివరకు పూర్తి స్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటించలేదు. కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, అన్నింటికీ మించి కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వాయిదా పడుతూ వస్తోంది. అయితే, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రతిష్ఠంభనకు తెరదించేందుకు అధిష్ఠానం కసరత్తు ముమ్మరం చేసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేతృత్వంలో గాంధీభవన్ వేదికగా ఈ నియామకాలపై తుది నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ కమిటీ కసరత్తులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధానమైన పేరు.. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్. వాస్తవానికి ఆమె కేబినెట్ హోదాతో కూడిన కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆశించినట్లు గాంధీభవన్ వర్గాల్లో టాక్ నడిచింది. అయితే, ఇప్పటికే ఆమె భర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో కీలకమైన నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రిగా కొనసాగుతున్నారు. ఒకే ఇంటికి రెండు కేబినెట్ ర్యాంక్ పదవులు ఇస్తే పార్టీలోనే కాకుండా, ప్రజల్లోనూ ప్రతికూల చర్చకు దారితీస్తుందని అధిష్ఠానం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ప్రభుత్వ పదవి కాకుండా, పార్టీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని పెద్దలు వ్యూహం రచించారు.
పద్మావతి రెడ్డికి ఈ పదవి ఇవ్వడం వెనుక అధిష్ఠానం అనేక సామాజిక, రాజకీయ లెక్కలను వేస్తోంది. పార్టీ కమిటీల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించాలనే రాహుల్ గాంధీ సంకల్పానికి ఇది అద్దం పడుతుంది. రెడ్డి సామాజికవర్గానికి చెందిన సీనియర్ మహిళా నాయకురాలిగా పద్మావతికి ఈ పదవి ఇవ్వడం ద్వారా ఆ కోటాను కూడా భర్తీ చేసినట్లవుతుంది. ఒకే ఒక నియామకంతో అటు మహిళా కోటా, ఇటు రెడ్డి సామాజిక సమీకరణం.. రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చనేది కాంగ్రెస్ పెద్దల ఆలోచన.
టీపీసీసీలో మొత్తం నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లకు అవకాశం ఉంది. పద్మావతి నియామకంతో ఒక స్థానం భర్తీ అయితే, మిగిలిన మూడు స్థానాల కోసం గాంధీభవన్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. సామాజిక న్యాయం అనే సూత్రం ఆధారంగా ఈ మిగిలిన మూడు స్థానాలను కేటాయించాలని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పట్టుబడుతున్నారు. ఒక స్థానాన్ని మహిళ, రెడ్డి కోటాలో ఉత్తమ్ పద్మావతికి ఇస్తే.. రెండో స్థానాన్ని వెనుకబడిన తరగతులకు ఇచ్చే అవకాశం ఉంది. మూడో స్థాన్ని ఎస్సీ, నాలుగో స్థానాన్ని ఎస్టీలతో భర్తీ చేయవచ్చు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలు మాత్రమే కాకుండా, బలమైన సంస్థాగత నెట్వర్క్ ఉంటేనే క్షేత్రస్థాయిలో విజయం సాధ్యమని అధిష్ఠానం గుర్తించింది. ఈ కమిటీల భర్తీ ద్వారా అటు అసంతృప్త నాయకులను బుజ్జగించడం, ఇటు ఎన్నికల సమరానికి క్యాడర్ను సమాయత్తం చేయడం కాంగ్రెస్ ముందున్న ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి







