లంచం ఇస్తేనే లోపలికి..డబ్బులిస్తేనే స్ట్రెచర్..ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిలువుదోపిడీ
Government Hospitals: హైదరాబాద్‌లోని ప్రముఖ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కిందిస్థాయి సిబ్బంది ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఉచిత వైద్యం కోసం వచ్చే పేద రోగులు, వారి సహాయకుల నుంచి సిబ్బంది బలవంతంగా వసూళ్లకు పాల్పడుతున్నారు. ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిశ్చార్జి అయ్యే వరకు ప్రతి చిన్న పనికి లంచాలు డిమాండ్ చేస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, నిమ్స్ వంటి పెద్ద ఆసుపత్రుల్లో కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బంది ఈ దోపిడీకి తెరలేపారు.
కిడ్నీల సరఫరా పేరిట రూ. 1.5 లక్షల వసూలు..
నిమ్స్ ఆసుపత్రి రేడియాలజీ విభాగంలో పనిచేస్తున్న ఒక అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఏకంగా కిడ్నీలు సరఫరా చేస్తానని నమ్మించి, ఒక రోగి నుంచి రూ. 1.5 లక్షలు వసూలు చేశాడు. ఈ మోసంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో పోలీసులు సదరు ఉద్యోగిని అరెస్టు చేశారు.
ప్రతిదానికీ రేటు..
ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో వార్డుల్లోకి రోగి సహాయకులను పంపాలన్నా, స్ట్రెచర్‌పై రోగులను తరలించాలన్నా రూ. 50 నుంచి రూ. 100 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసర విభాగం వద్ద సెక్యూరిటీ సిబ్బందికి లంచం ఇస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. ఆఖరికి బెడ్ మీద దుప్పటి మార్చాలన్నా, మార్చురీ వద్ద మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించాలన్నా రూ. 5 వేల వరకు లాగుతున్నారు. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రుల్లో సైతం కాన్పుల కోసం రేట్లు ఫిక్స్ చేశారు. అబ్బాయి పుడితే రూ. 5 వేలు, అమ్మాయి పుడితే రూ. 3 వేలు ఇవ్వాలంటూ సిబ్బంది తెగేసి చెబుతున్నారు.
వెలుగులోకి తెచ్చిన వీడియో..
ఇటీవల ఉస్మానియా ఆసుపత్రిలో ఇన్పేషెంట్లను పరామర్శించేందుకు వచ్చిన వారి నుంచి ఒక మహిళా సెక్యూరిటీ గార్డు రాత్రి వేళ డబ్బులు వసూలు చేస్తుండగా, ఓ రోగి సహాయకుడు దానిని మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది.
ఈ తరహా వసూళ్లపై గతంలో ఫిర్యాదులు రావడంతో ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిపై చర్యలు తీసుకున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం మారడం లేదు. రాత్రి వేళల్లో ఆర్‌ఎంఓలు తమ గదులకే పరిమితమవుతుండటంతో వార్డుల్లో సిబ్బంది పర్యవేక్షణ కరువైందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి







