శేషాచలం అడవులు.. అంతరించిపోతున్న జీవులకు కేరాఫ్ అడ్రస్
Seshachalam: మానవ మనుగడ సాఫీగా సాగాలన్నా, పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలన్నా జీవవైవిధ్యం (Biodiversity) ఎంతో అవసరం. మనకు కావాల్సిన స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అన్నీ ప్రకృతి నుంచే లభిస్తాయి. కానీ, పెరుగుతున్న కాలుష్యం, అడవుల నరికివేత, వాతావరణ మార్పుల వల్ల ఎన్నో అరుదైన జీవజాతులు నేడు అంతరించిపోయే ప్రమాదంలో పడ్డాయి. ఈ నేపథ్యంలో ‘ప్రకృతిని రక్షించుకోవడం అంటే.. మనల్ని మనం కాపాడుకోవడమే’ అనే ఉద్దేశంతో శేషాచలం అడవుల ప్రాధాన్యతపై ప్రత్యేక కథనం.”
89.40% పచ్చదనంతో శేషాచలం..
ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ (ISFR) ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిధిలోని శేషాచలం అటవీ ప్రాంతం ఏకంగా 89.40 శాతం పచ్చదనంతో అలరారుతోంది. అడవుల అద్భుత నిర్వహణలో ఈ ప్రాంతం దేశంలోనే అత్యుత్తమ స్థానంలో నిలిచినట్లు ఐఎస్ఎఫ్ఆర్ స్పష్టం చేసింది.
ప్రజల భాగస్వామ్యం అవసరం..
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవడంలో ప్రజలు భాగస్వాములు కావాలి. అడవులు, వన్యప్రాణుల రక్షణలో అటవీశాఖకు సహకరించినప్పుడే మానవ మనుగడకు భరోసా కలుగుతుంది. జీవవైవిధ్య క్షీణతను అడ్డుకోవడం అనేది ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు, అది సమస్త మానవాళి ఉమ్మడి కర్తవ్యం. పర్యావరణ పరిరక్షణ కోసం క్షేత్రస్థాయిలో మనం చేసే ప్రతి చిన్న ప్రయత్నమూ అమూల్యమైనదే.
బయోస్పియర్ ప్రత్యేకతలు ఇవే..
శేషాచలం అడవులు దక్షిణ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన జీవవైవిధ్య హాట్ స్పాట్ గా గుర్తింపు పొందాయి. ఈ అడవుల ప్రత్యేకతలు క్రింది విధంగా ఉన్నాయి. తూర్పు కనుమలలో భాగమైన ఈ ప్రాంతాన్ని 2010లో యునెస్కో (UNESCO) ‘బయోస్పియర్ రిజర్వ్’గా ప్రకటించింది. ఇది ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లో కలిపి దాదాపు 4,756 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇందులో శ్రీవేంకటేశ్వర జాతీయ అభయారణ్యం కూడా ఉంది. ప్రపంచంలో మరెక్కడా లభించని, అంతరించిపోతున్న అరుదైన ఎర్రచందనం వృక్షాలకు ఈ అడవులు నిలయంగా ఉన్నాయి. అలాగే ఇక్కడ దాదాపు 1,500 జాతుల వనమూలికలు (ఔషధ మొక్కలు) ఉన్నాయి. అంతరించిపోతున్న అరుదైన వన్యప్రాణులైన దేవాంగ పిల్లి (స్లెండర్ లోరిస్), బంగారు బల్లి, ఎలుక జింక (మౌస్ డీర్), బెట్టు ఉడుత వంటి జీవులకు ఈ అడవులు ఆవాసంగా మారాయి. వీటితో పాటు 178 నుండి 215 విభిన్న రకాల పక్షి జాతులు ఇక్కడ జీవిస్తున్నాయి.







