ఏపీ బీజేపీ రాజ్యసభ రేసులో ఈ ముగ్గురిలో ఎవరు..?
ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 18న జరగబోయే నాలుగు రాజ్యసభ స్థానాల ఎన్నికల(Rajyasabha Elections) వేడి క్లైమాక్స్ దశకు చేరుకుంది. అసెంబ్లీలో ఉన్న సంఖ్యా బలాన్ని బట్టి ఈ నాలుగు స్థానాలు అధికార ఎన్డీఏ కూటమి (TDP-JSP-BJP) కైవసం చేసుకోవడం ఖాయం కాగా, బీజేపీకి దక్కే కోటా సీటుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇప్పటివరకు ఈ రేసులో ఏపీ బీజేపీ స్థానిక నేతల పేర్లు బలంగా వినిపించినప్పటికీ, తాజా సమీకరణాల ప్రకారం తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై పేరు రేసులోకి రావడం సంచలనంగా మారింది.
ఢిల్లీ బీజేపీ అధిష్టానం ఈ ఏకైక స్థానం కోసం అన్నామలై, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మరియు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ల పేర్లను తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. దక్షిణ భారతదేశంలో బీజేపీని బలోపేతం చేసే వ్యూహంలో భాగంగా మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలైను ఆంధ్రప్రదేశ్ కోటా నుండి రాజ్యసభకు పంపేందుకు ఢిల్లీ పెద్దలు మొగ్గు చూపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో బలమైన టాక్ నడుస్తోంది.
ఇవి కూడా చదవండి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు మరియు అక్కడ ప్రాంతీయ పార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎంకేలతో పోటీని తట్టుకునేందుకు అన్నామలైకు పార్లమెంట్ వేదికగా ఒక జాతీయ గుర్తింపు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది.
గత ఎన్నికల్లో ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కూడా అన్నామలై తరఫున ప్రచారం చేయడంతో, కూటమి భాగస్వామి అయిన తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు అభ్యంతరం చెప్పకపోవచ్చనే విశ్లేషణలు వినపడుతున్నాయి. మరోవైపు ఉమ్మడి రాష్ట్ర చివరి ముఖ్యమంత్రిగా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా గట్టి పోటీ ఇస్తోంది. రాయలసీమ ప్రాంతంలో పట్టున్న సీనియర్ నాయకుడైన కిరణ్ కుమార్ రెడ్డిని రాజ్యసభకు పంపితే అటు ప్రాంతీయ బలాన్ని పెంచడంతో పాటు, పార్లమెంట్లో ఒక సీనియర్ వాయిస్‌ను ఉంచవచ్చని అధిష్టానం భావిస్తోంది.
వీరిద్దరితో పాటు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ, క్లిష్ట సమయాల్లో కూడా ఏపీలో బీజేపీ కేడర్‌ను నడిపించిన లోకల్ సీనియర్ లీడర్ పీవీఎన్ మాధవ్ పేరు కూడా పరిశీలనలో ఉంది. జూన్ 1న అధికారికంగా నోటిఫికేషన్ విడుదల కానుండటంతో, ఈ ముగ్గురిలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది మరికొద్ది రోజుల్లోనే తేలనుంది. కూటమితో సఖ్యతగా ఉండే నేతకే అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి







