మీ తాత మహాత్ముడు కాదు జగన్: పార్థసారథిరెడ్డి సంచలన కౌంటర్..!
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSRCP) అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys Jagan) తన తాత వైఎస్ రాజారెడ్డి హత్యపై చేసిన ఆరోపణలపై ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మంగలి కృష్ణతో కలిసి, నాపై సూట్కేస్ బాంబు ప్రయోగించింది మీరు కాదా జగన్..?” అంటూ ఆయన నేరుగా ప్రశ్నించారు. మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్లు రాష్ట్ర ప్రజల ముందు బిల్డప్ ఇవ్వద్దంటూ జగన్ పై మండిపడ్డారు.
తమ మధ్య ఉన్న పాత కక్షలను గుర్తు చేస్తూ పార్థసారథిరెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. “మీ తాత మనుషులు నన్ను ఎలా నరికారో.. అలాగే మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు” అంటూ సంచలన నిజాలను వెల్లడించారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన రాజకీయ పరిణామాలను కూడా ఆయన ప్రస్తావించారు. నా మనుషులను అక్రమంగా జైళ్లకు పంపి, నా సొంత గనుల వ్యాపారాలను రద్దు చేయించడానికి మీ నాన్న చేసిన కుట్రలు ఫ్యాక్షన్ ప్రాంతంలో అందరికీ తెలుసని ఆరోపించారు.
వైఎస్ కుటుంబమంతా పైకి ఒకలా, లోపల ఒకలా వ్యవహరిస్తారని పార్థసారథిరెడ్డి ధ్వజమెత్తారు. “మీరంతా పైకి తేనె పూసిన కత్తులైతే.. నేను మాత్రం పౌరుషంతో బతుకుతున్నా జగన్” అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఫ్యాక్షన్ రాజకీయాల నేపథ్యంలో వైఎస్ రాజారెడ్డి హత్యపై జగన్ చేసిన కామెంట్స్, దానికి ప్రతిగా పార్థసారథిరెడ్డి ఇచ్చిన ఈ సంచలన కౌంటర్ ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో, ముఖ్యంగా కడప జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ రోజు ఉదయం జగన్ మీడియా సమావేశంలో రాజారెడ్డి హత్య అంశాన్ని ప్రస్తావించిన సంగతి తెలిసిందే.







