మరోసారి చర్చల్లోకి మైకేల్ జాక్సన్
పాప్ సంగీత ప్రపంచాన్ని శాశ్వతంగా మార్చిన మైకేల్ జాక్సన్(Michael Jackson) పేరు మరోసారి గ్లోబల్ స్థాయిలో చర్చకు వస్తోంది. ఆయన కెరీర్‌ను మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని చుట్టుముట్టిన వివాదాలను తిరిగి వెలుగులోకి తీసుకొస్తూ మైకేల్ జాక్సన్: ది వెర్డిక్ట్ అనే కొత్త డాక్యుసిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే బయోపిక్ కారణంగా సోషల్ మీడియాలో మైకేల్ జాక్సన్ పేరు ట్రెండ్ అవుతున్న వేళ, ఇప్పుడు ఈ డాక్యుసిరీస్పై కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా 2003లో వెలుగులోకి వచ్చిన బాలల లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆ తర్వాత జరిగిన కోర్టు విచారణలు మళ్లీ చర్చనీయాంశంగా మారాయి.
ట్రైలర్‌ను పరిశీలిస్తే, ఈ సిరీస్ కేవలం కేసు వివరాలకే పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. అప్పటి జ్యూరీ సభ్యులు, న్యాయవాదులు, మీడియా ప్రతినిధులు, కేసును దగ్గరగా చూసిన వ్యక్తుల వాఖ్యలతో ఆ కాలంలోని పరిస్థితులను తిరిగి ఆవిష్కరించే ప్రయత్నం కనిపిస్తోంది. కోర్టు చివరకు మైకేల్ జాక్సన్‌ను నిర్దోషిగా ప్రకటించినప్పటికీ, ఆయనపై వచ్చిన ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చకు దారి తీశాయి. అదే సమయంలో స్టార్డమ్ ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంపై ఎంతటి ప్రభావం చూపుతుందనే అంశాన్ని కూడా ఈ సిరీస్ హైలైట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల నిజ జీవిత సంఘటనలు, సెలబ్రిటీ వివాదాలు, కోర్టు కేసుల ఆధారంగా రూపొందుతున్న డాక్యుసిరీస్లకు ఓటీటీ ప్రపంచంలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఇప్పుడు మైకేల్ జాక్సన్ వంటి గ్లోబల్ ఐకాన్ చుట్టూ ఉన్న రహస్యాలు, అభిమానుల భావోద్వేగాలు, విమర్శకుల అభిప్రాయాలు అన్నీ కలిసిపోవడంతో ఈ ప్రాజెక్ట్ మరింత హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు అభిమానులు ఆయన వారసత్వాన్ని కాపాడాలని భావిస్తుండగా, మరోవైపు విమర్శకులు వివాదాస్పద అంశాలపై మళ్లీ చర్చ జరగాల్సిందే అంటున్నారు. దీంతో ఈ డాక్యుసిరీస్ విడుదల తర్వాత ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చ మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది.







