సర్కారు స్థలాల పరిరక్షణకు బ్రేకులు.. ఇంకా అందుబాటులోకి రాని ‘ల్యాండ్ బ్యాంక్’ యాప్
Land Bank App:ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన ‘ల్యాండ్బ్యాంక్’ యాప్ రూపకల్పనలో తీవ్ర ఆలస్యం జరుగుతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని ప్రభుత్వ భూముల వివరాలన్నింటినీ ఒకే చోట భద్రపరిచేందుకు రెండేళ్ల క్రితమే ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ యాప్ బాధ్యతలను తొలుత సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్) కి అప్పగించినప్పటికీ, ఆ తర్వాత మరో సంస్థ ఈ ప్రత్యేక యాప్ను రూపొందిస్తామని ముందుకు వచ్చింది.
ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాలు, క్వార్టర్స్, వివిధ శాఖలకు కేటాయించిన భూములు, అలాగే కోర్టు వివాదాల్లో ఉన్న స్థలాల వివరాలను యాప్లో పొందుపరిచే ప్రక్రియ ఏడాది క్రితమే ప్రారంభమైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు. హైదరాబాద్లో ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కూడా అమలు చేయాలని భావించినా, యాప్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయింది.
సాంకేతిక అంశాలు ..
ప్రభుత్వ భూములను యాప్లో నమోదు చేసే సమయంలో బహుభుజి (Polygon), జియో కోఆర్డినేట్ల పద్ధతిని ఉపయోగించాలని నిపుణులు సూచించారు. దీనివల్ల ఒక్క అంగుళం భూమి కూడా కొలతల్లో తేడా రాకుండా రికార్డవుతుంది. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించడానికి ప్రయత్నిస్తే జియో కోఆర్డినేట్ల ద్వారా అధికారులకు సమాచారం అందుతుంది. క్షేత్రస్థాయి ఫోటోలు, మార్పుల వివరాలు కోర్టుల్లో బలమైన సాక్ష్యాధారాలుగా ఉపయోగపడతాయి.
శిక్షణ ఇచ్చినా ఫలితం శూన్యం..
హైదరాబాద్ జిల్లాలోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, గృహ సముదాయాలను జియో ట్యాగింగ్ ద్వారా ఫోటోలు తీసి ఆన్లైన్లో అప్లోడ్ చేయడంపై రెవెన్యూ అధికారులకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. ప్రతి మండలం పరిధిలోని వివరాలను డిజిటల్ పద్ధతిలోకి మార్చి, జిల్లా మొత్తానికి ఒక మ్యాప్ సిద్ధం చేయాలని భావించారు. అయితే అధికారులకు శిక్షణ పూర్తయినప్పటికీ, యాప్ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఆ శిక్షణ అంతా ప్రస్తుతం వృథాగా మారింది.







