అబ్బా ఏం బుకాయింపు.. జనగణన సర్వేలో అధికారులకే చుక్కలు చూపిస్తున్న జనం
Survey: నగరంలో కొనసాగుతున్న జనగణన హౌస్ లిస్టింగ్ సర్వేలో అధికారులకు ప్రజల నుంచి వింత అనుభవాలు, విచిత్రమైన సమాధానాలు ఎదురవుతున్నాయి. చేతిలో ఖరీదైన స్మార్ట్ఫోన్లు పెట్టుకుని కూడా కీప్యాడ్ ఫోన్లనే వాడుతున్నామని, ఇంటర్నెట్ అంటే ఏంటో తెలియదని కొందరు చెబుతుండగా.. కంప్యూటర్, ల్యాప్టాప్ అనే పదాలను ఇప్పుడే మొదటిసారి వింటున్నామని మరికొందరు బుకాయిస్తున్నారు. ఇంటి ముందు బైక్లు, కార్లు కనిపిస్తున్నా.. అవి తమవి కావని, పక్కింటోళ్లవని లేదా బంధువులవని సమాధానాలిస్తున్నారు. ప్రతి వంద మందిలో కనీసం 10 నుండి 15 మంది సొంత ఇళ్లను కూడా అద్దె ఇల్లుగానే చూపిస్తున్నారు. మేడలపై నివసిస్తున్నప్పటికీ ఒకే పడకగదిలోనే అందరం ఉంటున్నామని అబద్ధాలు చెబుతుండటం అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎన్యూమరేటర్ల ఆవేదన..
ప్రజలు ఇలా తప్పుడు సమాధానాలు చెప్పినప్పటికీ, నిబంధనల ప్రకారం వారు చెప్పిన దాన్నే నమోదు చేయాల్సి వస్తోందని ఎన్యూమరేటర్లు (గణకులు) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే సమాచారం కేవలం ప్రజల జీవన స్థితిగతులను తెలుసుకోవడానికి మాత్రమేనని, ప్రస్తుతం అందుతున్న ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు, ఆసరా పింఛన్లకు ఈ డేటాకు ఎలాంటిసంబంధం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు భయపడకుండా నిజాయితీగా సరైన వివరాలు చెప్పాలని కోరుతున్నారు.
12 లక్షల ఇళ్ల జాబితా నమోదు..
నగరంలో ఇప్పటివరకు 12.62 లక్షల ఇళ్లను లిస్టింగ్ చేసి, వాటిలోని సుమారు 50 లక్షల మంది కుటుంబ సభ్యుల సంఖ్యను అధికారులు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రాథమికంగా కుటుంబ పెద్ద పేరు, సభ్యుల సంఖ్యను మాత్రమే సేకరిస్తున్నారు. నగర పరిధిలోని సర్వే వివరాలను పరిశీలిస్తే.. ఎంసీఎన్ పరిధిలో 4,988 హెచ్ఎల్బీలకు గానూ 4,967 లిస్టింగ్ పూర్తి కాగా, అందులో 4.13 లక్షల జనాభా నమోదైంది. జీహెచ్ఎంసీ పరిధిలో 9,913 హెచ్ఎల్బీలకు గానూ 9,851 లిస్టింగ్ పూర్తయి, అత్యధికంగా 5.06 లక్షల జనాభా నమోదైంది. అలాగే సీఎంసీ పరిధిలో 5,218 హెచ్ఎల్బీలకు గానూ 5,185 లిస్టింగ్ ప్రక్రియ ద్వారా 3.29 లక్షల జనాభాను గుర్తించారు. కంటోన్మెంట్ పరిధిలో 437 హెచ్ఎల్బీలకు గానూ 279 లిస్టింగ్ పూర్తయి, 0.13 లక్షల జనాభా నమోదైంది. మొత్తంగా నగరం అంతటా 20,556 హెచ్ఎల్బీలకు గానూ 20,282 లిస్టింగ్ ప్రక్రియ పూర్తయింది.
100 శాతం విధుల్లోకి సిబ్బంది..
నగరంలోని 300 డివిజన్ల పరిధిని 20,556 హౌస్ లిస్టింగ్ బ్లాకులుగా (HLB) విభజించి సర్వే చేపడుతున్నారు. ప్రారంభంలో సాంకేతిక సమస్యలు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సర్వే మందగించినా, ఉన్నతాధికారులు చర్యలు చేపట్టడంతో బుధవారం నాటికి దాదాపు 100 శాతం సిబ్బంది విధుల్లోకి చేరారు. అయితే కంటోన్మెంట్ బోర్డు పరిధిలో మాత్రం హాజరు శాతము 64 శాతంగానే ఉంది. ఎండ తీవ్రత దృష్ట్యా కొన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు కూడా సర్వే నిర్వహిస్తున్నారు. వేసవి కాలం అయినందున ప్రజలు సర్వే సిబ్బందికి పూర్తిస్థాయిలో సహకరించాలని జీహెచ్ఎంసీ కమిషనర్, ప్రధాన ఎన్నికల అధికారి కోరారు.







