దేవర2 గురించి ఏమీ తెలియదంటున్న రత్నవేలు
టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సీక్వెల్స్ లిస్ట్ లో దేవర2(Devara2) పేరు ముందువరుసలో ఉంటుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) హీరోగా, డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కించిన దేవర తొలి భాగం భారీ హైప్‌ను సొంతం చేసుకోవడంతో రెండో భాగంపై కూడా అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా సినిమాటోగ్రాఫర్ రత్నవేలు(Rathnavelu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కొత్త చర్చకు దారి తీశాయి. ప్రస్తుతం తాను పెద్ది(Peddi) సినిమా పనులతో బిజీగా ఉన్నానని, దేవర2 గురించి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం తనకు లేదని ఆయన చెప్పడం అభిమానులను ఆలోచనలో పడేసింది.
అంతేకాదు, రంగస్థలం తర్వాత తాను ఎక్కువగా పీరియడ్ బ్యాక్‌డ్రాప్ సినిమాలే చేస్తున్నానని, ఇకపై అలాంటి ప్రాజెక్టుల నుంచి కొంత విరామం తీసుకోవాలనుకుంటున్నానని రత్నవేలు వ్యాఖ్యానించారు. కథలో భావోద్వేగం బలంగా ఉంటేనే తనకు ఆ సినిమా కనెక్ట్ అవుతుందని, జానర్ కంటే ఎమోషన్ ముఖ్యమని ఆయన చెప్పిన మాటలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పెద్ది ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఈ వ్యాఖ్యలను నెటిజన్లు దేవర 2 పరిస్థితితో లింక్ చేస్తూ చర్చిస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా దేవర2 నుంచి ఏదైనా స్పెషల్ అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశించారు. కానీ మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి. కొరటాల శివ ప్రస్తుతం మరో ప్రాజెక్ట్‌పై ఫోకస్ చేస్తున్నారనే ప్రచారం కూడా దీనికి బలం చేకూరుస్తోంది. అయితే ఇండస్ట్రీ వర్గాల అభిప్రాయం మాత్రం భిన్నంగా ఉంది. దేవర తొలి భాగం క్లైమాక్స్‌ను స్పష్టంగా సీక్వెల్‌కు బేస్‌గా డిజైన్ చేశారని, అందువల్ల ప్రాజెక్ట్ పూర్తిగా ఆగిపోయే అవకాశాలు తక్కువేనని చెబుతున్నారు.







