ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ పై కేసు నమోదు..!
ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ రావు(Prof Nageswar), ఒక ప్రముఖ టీవీ ఛానెల్ పై కాకినాడ(Kakinada) జిల్లా ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన పార్టీ(Janasena) నాయకులు ఫిర్యాదు చేశారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్(Pawan Kalyan), మంత్రి నాదెండ్ల మనోహర్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లపై నాగేశ్వర్ అనుచిత, ఆధారాల్లేని వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. ఇటీవల ఒక టీవీ ఛానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్, ఏపీ రాజకీయాలకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
గతంలో పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ కలిసి ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారని, ఆ సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని(Ys Jagan) అరెస్ట్ చేయాలని వారిపై ఒత్తిడి వస్తోందని అమిత్ షాకు వివరించారని నాగేశ్వర్ పేర్కొన్నారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ.. “రాజకీయాల్లో చంద్రబాబు తాత్కాలిక మిత్రుడు, కానీ జగన్ శాశ్వత మిత్రుడు. చంద్రబాబుకు జగన్‌తో శత్రుత్వం ఉండొచ్చు కానీ మనకెందుకు..?” అని అన్నట్లు జనసేన కోర్ కమిటీ సమావేశం ద్వారా తనకు సమాచారం అందిందంటూ నాగేశ్వర్ వ్యాఖ్యానించారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో రాజకీయ దుమారం రేగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన ఈ వ్యాఖ్యలను జనసేన పొలిట్ బ్యూరో చైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ తీవ్రంగా ఖండించారు. తాము ఎప్పుడూ అమిత్ షా దగ్గరకు వెళ్లి ఇతర పార్టీల నేతల అరెస్టుల గురించి మాట్లాడలేదని స్పష్టం చేశారు. నాగేశ్వర్ వంటి సీనియర్ విశ్లేషకుడిపై తమకు గౌరవం ఉందని, అయితే ఎలాంటి ఆధారాలు లేని ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేయడం ఆయన విశ్వసనీయతకే భంగకరమని హితవు పలికారు.
తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కూటమిలో కుంపటి పెట్టేందుకే కొందరు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వివాదంపై జనసేన శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాకినాడ రూరల్ ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్లో జనసేన నాయకులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌తో పాటు ఆ వ్యాఖ్యలను ప్రసారం చేసిన సదరు టీవీ ఛానెల్‌పై ఫిర్యాదు ఇచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించేలా, ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై అపోహలు సృష్టించేలా ఈ తప్పుడు ప్రచారం సాగిందని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.







