పుల్వామా ఉగ్రదాడి ‘‘మాస్టర్ మైండ్’’ పాక్ లో హతం..
పుల్వామా ఉగ్రదాడిలో కీలక సూత్రధారి, వాంటెడ్ ఉగ్రవాది హమ్జా బుర్హాన్ హతమయ్యాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తులు అతడ్ని కాల్చి చంపేశారు. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది జవాన్లు మరణించారు.
పుల్వామా దాడికి పాకిస్థాన్‌కు చెందిన జైష్-ఎ-మహ్మద్ ఉగ్రసంస్థ బాధ్యత వహించింది. జైష్-ఎ-మహ్మద్ సంస్థకు అనుబంధంగా పని చేసిన హమ్జా బుర్హాన్ పుల్వామా దాడి ప్రణాళికలో కీలక పాత్ర పోషించాడని భారత దర్యాప్తు సంస్థలు అనుమానించాయి. తాజాగా అతడు గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హతమయ్యాడు.
పుల్వామాకి చెందిన బుర్హాన్ ఉన్నత విద్య అభ్యసిస్తాన్న సాకుతో 2017 లో పాక్ కి వెళ్లాడు. ఆ తర్వాత ఓ ఉపాధ్యాయునిగా నటించాడు. అయితే.. బుర్హాన్ వచ్చిన పని విషయంలో గానీ, అతను ఎవరో గానీ బయటి ప్రపంచానికి తెలియకుండా హమ్జాలోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ కీలక పాత్ర పోషించాడు. పాఠశాల టీచర్ గా నటిస్తూ, ఇతర కార్యకలాపాలు నిర్వహించేవాడు. ఇలా తన ఉనికి దాస్తూ.. చాలా రోజులు పాక్ లోనే వుండిపోయాడు.
హమ్జా బుర్హాన్, నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్-బదర్‌లో ఒక అగ్ర కమాండర్. హమ్జా బుర్హాన్ స్వస్థలం జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని రత్నిపోరా. పాక్ కి వెళ్లిన తర్వాత స్థానిక యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, నిషేధిత ఉగ్రవాద సంస్థకు నిధులు సమకూర్చడం, చొరబాటు నెట్ వర్క్ ను నడపడంలో కీలకంగా మారాడు.
2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడిలో 40 మందికి పైగా CRPF సిబ్బంది అమరులయ్యారు. ఈ దారుణమైన దాడిని కుట్ర పన్నడంలో పోషించిన కీలక పాత్ర కారణంగా, భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ 2022లో UAPA కింద ఇతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది.మంత్రిత్వ శాఖ ప్రకారం, పుల్వామా మరియు దక్షిణ కాశ్మీర్లలో భీభత్సాన్ని వ్యాప్తి చేయడంలో, యువతను ఉగ్రవాద సంస్థల్లోకి చేర్చుకోవడంలో మరియు ఉగ్రవాదం కోసం నిధులు సేకరించడంలో హంజా బుర్హాన్ క్రియాశీల పాత్ర పోషించేవాడు. అంతేకాకుండా పుల్వామా దాడికి కుట్ర పన్నడం, ఉగ్రవాదులకు స్థానికంగా లాజిస్టికల్ సపోర్ట్, ఆర్థిక సహాయాన్ని అందించడంలో బుర్హాన్ కీలకమని జాతీయ దర్యాప్తు సంస్థ ప్రకటించింది.
పుల్వామాలో ఏం జరిగిందంటే?
2019 ఫిబ్రవరి 14 న జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రదాడి జరిగింది. సీఆర్పీఎఫ్ కాన్వాయ్ ని లక్ష్యంగా చేసుకునే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడి చేశారు. దీంట్లో 40 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఉగ్రదాడి వెనుక పాక్ ప్రేరేపిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ వున్నట్లు భారత నిఘా వర్గాలు గుర్తించాయి. దీనికి ప్రతీకారంగానే భారత వాయుసేన ఫిబ్రవరి 26 న వైమానిక దాడులు కూడా చేసింది.







