59 ఏళ్ల కలను సాకారం చేసుకుంటున్న కాంగ్రెస్
తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి 59 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. విజయ్ ప్రభుత్వంలో ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాజేష్ కుమార్, పి. విశ్వనాథన్ కేబినెట్ లో చేరుతున్నారు. దీంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం వచ్చి చేరింది. గత 59 ఏళ్లలో తొలిసారిగా కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వం భాగం కానుంది. ఇదో చారిత్రక ఘట్టంగా కాంగ్రెస్ చెబుతోంది.
నిజానికి ద్రావిడ రాజకీయాల్లో జాతీయ పార్టీలది కేవలం ప్రేక్షక పాత్రే. పెత్తనం అంతా ద్రావిడ పార్టీలదే. అటు డీఎంకే, అటు అన్నా డీఎంకే రెండు కూడా తమిళనాడును శాసించాయి. అటు కాంగ్రెస్ అయినా, ఇటు బీజేపీ అయినా అక్కడ తోక పార్టీలే. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పినా.. .తమిళనాడుకు వచ్చే సరికి అవి శాసించే పార్టీలుగా వుండేవి కావు.
దశాబ్దాలుగా రాష్ట్ర మంత్రివర్గంలో ప్రత్యక్ష భాగస్వామ్యం లేకుండా ద్రవిడ పార్టీలకు జూనియర్ కూటమి భాగస్వామిగా సంప్రదాయబద్ధంగా వ్యవహరిస్తున్న తమిళనాడులో ఈ పరిణామం ఒక ప్రధాన రాజకీయ మార్పుగా పరిగణించబడుతోంది.
అయితే, ఈసారి కాంగ్రెస్ ద్రవిడ ప్రధాన పార్టీలతో తన చిరకాల పొత్తును వీడి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సహకరించేందుకు సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ‘తమిళగ వెట్రి కజగం’ (TVK)తో చేతులు కలిపింది.
234 మంది సభ్యులు కలిగిన తమిళనాడు శాసనసభలో, TVK ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, 118 స్థానాల మెజారిటీ మార్కును చేరుకోవడానికి 10 స్థానాల కొరతను ఎదుర్కొంది. తదనంతరం, కాంగ్రెస్, CPI, CPI(M), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) మరియు విడుతలై చిరుతైగల్ కచ్చి (VCK) విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి; తద్వారా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది.







