ప్రొఫెసర్ నాగేశ్వర్ ను వెంటాడుతున్న కేసులు..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత రెండు రోజులుగా సంచలనం రేపుతున్న ప్రొఫెసర్ కె. నాగేశ్వర్(Prof Nageswar) వివాదం సరికొత్త మలుపు తిరిగింది. జనసేన(janasena) అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో(Pawan Kalyan) పాటు మంత్రి నాదెండ్ల మనోహర్‌లను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి దారితీశాయి. ఈ నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై అధికారికంగా కేసు నమోదైంది.
ఇటీవల ఒక టెలివిజన్ డిబేట్ మరియు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడుతూ.. గతంలో పవన్ కళ్యాణ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కలిసినప్పుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(Ys jagan) అరెస్ట్ గురించి చర్చించారంటూ కొన్ని వ్యాఖ్యలు చేసారు. దీనిపై దుమారం రేగింది. వాస్తవాలను తెలుసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులపై ఇలాంటి గాసిప్స్ మాట్లాడటం అజ్ఞానానికి నిదర్శనమని కూటమి నేతలు మండిపడ్డారు. ముఖ్యంగా జనసేన ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మాజీ మంత్రి సోము వీర్రాజులు ప్రొఫెసర్ నాగేశ్వర్ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.
ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టను భంగపరిచేలా ఉన్నాయని, జనసైనికుల మనోభావాలను దెబ్బతీశాయని జనసేన తీవ్రంగా పరిగణించింది. ఈ క్రమంలో మచిలీపట్నానికి చెందిన జనసేన యాక్టివిస్ట్ మత్తి రాము స్థానిక పోలీస్ స్టేషన్లో రాతపూర్వక ఫిర్యాదు చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ఉద్దేశపూర్వకంగానే కూటమి నేతలపై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు ఫిర్యాదులో పేర్కొనడంతో, పోలీసులు ప్రొఫెసర్ నాగేశ్వర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివాదం ముదరడం, రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవడంతో ప్రొఫెసర్ నాగేశ్వర్ వెనక్కి తగ్గారు. తాను మాట్లాడిన సమాచారం అవాస్తవమని గ్రహించి, పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్‌లపై చేసిన వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నట్లు ఒక వీడియో ద్వారా అధికారికంగా ప్రకటించారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ తన తప్పును ఒప్పుకుని వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవడాన్ని జనసేన పార్టీ స్వాగతించింది. నాగేశ్వర్ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో.. జనసైనికులు ఈ వివాదాన్ని ఇంతటితో వదిలేయాలని పార్టీ కేంద్ర కార్యాలయం ఒక కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే, ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌పై పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు, అసత్య ఆరోపణలు చేసే ఇతర వ్యక్తులపై మాత్రం చట్టపరమైన చర్యలు మరియు కేసులు తప్పవని జనసేన జాతీయ అధికార ప్రతినిధి వేములపాటి అజయ్ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి







