ఐపీఎల్ క్రేజ్.. నకిలీ యాప్‌లు, బ్లాక్ టికెట్లతో మాయగాళ్ల దోపిడీ
Cyber Crime: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్ క్రేజ్ ముసుగులో కేటుగాళ్లు భారీ దోపిడీకి తెరలేపారు. ఉప్పల్ స్టేడియం వేదికగా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్ల మధ్య జరగనున్న మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు ఆసక్తి చూపుతుండటాన్ని ఆసరాగా చేసుకుని నకిలీ టికెట్ల దందా ముమ్మరంగా సాగుతోంది. క్రికెట్ ప్రేమికుల క్రేజ్‌ను ఆసరాగా చేసుకుని నకిలీ మొబైల్ యాప్‌ల ద్వారా టికెట్లు అంటగడుతూ దళారులు భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు.
నకిలీ యాప్‌లు..
ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కోహ్లీని దగ్గరగా చూడాలనే కోరికతో అభిమానులు ఎంతైనా పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. స్టేడియంలో నచ్చిన చోట కూర్చుని మ్యాచ్ చూసేలా టికెట్లు ఇప్పిస్తామని నమ్మించి, నకిలీ యాప్‌లతో దళారులు ప్రేక్షకులను మోసం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రూ. 1,000 విలువైన టికెట్‌ను ఒక అభిమాని ఏకంగా రూ. 20 వేలకు బ్లాక్‌లో కొనుగోలు చేయగా.. కొత్తగా పెళ్లయిన ఒక జంట ఏజెంట్లకు రూ. లక్ష చెల్లించి మోసపోయారు. అలాగే రూ. 7 వేల టికెట్ రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు, కార్పొరేట్ బాక్స్ టికెట్లు రూ. 50 వేల వరకు పలుకుతున్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసులు..
స్టేడియం పరిసర ప్రాంతాల్లో కొందరు ఏజెంట్లు బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేయడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. గత రెండు రోజులుగా వందలాది నకిలీ టికెట్లు చేతులు మారినట్లు గుర్తించిన పోలీసులు ఇప్పటికే 10 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఐపీఎల్ మ్యాచ్‌లను టార్గెట్ చేస్తూ పందేల రాయుళ్ల నుంచి కోట్లు కొల్లగొట్టేందుకు బెట్టింగ్ మాఫియా సిద్ధమైంది. విదేశాల్లో ఉన్న సూత్రధారులు వెబ్సైట్లు, యాప్‌ల ద్వారా ఏజెంట్లకు ఐడీలు కేటాయిస్తూ నగదు లావాదేవీలు గుట్టుగా సాగేలా ‘మ్యూల్ ఖాతాలను’ ఉపయోగిస్తున్నారు.
శుక్రవారం జరిగే మ్యాచ్‌పై నగరంలో దాదాపు రూ. 20 కోట్ల మేర పందేలు జరిగే అవకాశం ఉందని ఒక పోలీస్ అధికారి వెల్లడించారు. పోలీసులకు దొరకకుండా నిర్వాహకులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతున్నారని, నగరంలో బెట్టింగ్‌లు నిర్వహించే కీలక వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచామని పోలీసులు స్పష్టం చేశారు.







