రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సరికొత్త రికార్డు
Rangareddy : చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల కేసులను వేగంగా పరిష్కరిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే ఏకంగా 150 కేసుల్లో నిందితులకు కఠిన శిక్షలు విధిస్తూ అద్భుతమైన తీర్పులను వెలువరించింది.
ప్రత్యేక కోర్టులను..
ప్రస్తుతం పోక్సో కేసులు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ నమోదవుతుండటం, అందులోనూ బాధితులకు పరిచయమున్న వారు, సమీప బంధువులు, ఇరుగుపొరుగు వారే ఎక్కువగా నిందితులుగా మారుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో లైంగిక నేరాల నుంచి చిన్నారులను రక్షించేందుకు తీసుకొచ్చిన పోక్సో చట్టం-2012 కింద నమోదవుతున్న కేసులను త్వరితగతిన విచారించేందుకు ఈ ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేశారు.
రూ. 3 కోట్లకు పైగా నష్టపరిహారం..
రెండేళ్ల క్రితం ఈ కోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన పద్మావతి కేసుల విచారణలో వేగాన్ని పెంచారు. బాధితులకు సత్వర న్యాయం అందించడమే కాకుండా, త్వరితగతిన నిందితులకు శిక్షలు, జరిమానాలు విధిస్తున్నారు. అలాగే బాధితుల పునరావాసం కోసం అన్ని కేసుల్లో కలిపి సుమారు రూ. 3 కోట్లకు పైగా నష్టపరిహారాన్ని మంజూరు చేశారు. ఈ పరిహారం త్వరగా బాధితులకు అందేలా జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు ఎప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేస్తున్నారు.
శిక్షల వివరాలు ..
ఈ కేసుల్లో కోర్టు విధించిన శిక్షల వివరాలను పరిశీలిస్తే.. 10 కేసుల్లో నిందితులకు తుదిశ్వాస విడిచే వరకు సహజ జీవిత కాలం శిక్ష పడగా, మరో 15 కేసుల్లో యావజ్జీవ శిక్షలు ఖరారయ్యాయి. అలాగే 35 కేసుల్లో ఇరవై ఏళ్ల కారాగార శిక్ష, 17 కేసుల్లో పద్నాలుగేళ్ల జైలు శిక్ష విధించారు. మిగిలిన వాటిలో ఏడేళ్ల జైలు శిక్ష (02 కేసులు), ఐదేళ్ల జైలు శిక్ష (19 కేసులు), మూడేళ్ల జైలు శిక్ష (31 కేసులు), రెండేళ్ల జైలు శిక్ష (12 కేసులు) పడగా.. మరో 9 కేసుల్లో నిందితులకు ఏడాది పాటు జైలు శిక్ష పడింది.
ఇవి కూడా చదవండి







